NTV Telugu Site icon

Veligonda project: వెలిగొండ ప్రాజెక్ట్‌ జాతికి అంకితం.. సీఎం సంతోషం

Veligonda

Veligonda

Veligonda project: దశాబ్దాల కల నెరవేరుస్తూ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన.. ట్విన్ కెనాల్స్ ప్రారంభోత్సవ పైలాన్ ను ఆవిష్కరించారు. వెలిగొండ ప్రాజెక్టు ఫోటో గ్యాలరీని సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించి.. జరగాల్సిన పనులపై ఆరా తీశారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఇక, వెలిగొండ ప్రాజెక్ట్‌ ప్రారంభం అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్ధాల కల నెరవేరింది. టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందన్నారు.. అద్భుతమైన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు.

Read Also: Governor Tamilisai: మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై

కాగా, 2019లో వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.. గత 58 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనావల్ల పనులు చేయలేని పరిస్థితి ఏర్పడినా.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిమీల పనులను 2019, నవంబర్‌లో ప్రారంభించారు.. 2021, జనవరి 13 నాటికి వాటిని పూర్తిచేయించారు. ఇక, మంగళవారం నాటికి రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తి చేశారు. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు. అయితే, ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.978.02 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ ఖర్చుచేశారు. ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలిగొండలు అంటారు. వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాలను కలుపుతూ 373.5 మీటర్ల పొడవు, 63.65 మీటర్ల ఎత్తు తో.. 587 మీటర్ల పొడవు, 85.9 మీటర్ల ఎత్తు తో 356 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తు తో మూడు డ్యామ్‌లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్‌ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంది.