Site icon NTV Telugu

Memantha Siddham Bus Yatra: ఎల్లుండి నుంచే ‘మేమంతా సిద్ధం’.. వైసీపీ విస్తృత ఏర్పాట్లు..

Ys Jagan

Ys Jagan

Memantha Siddham Bus Yatra: ఆంధ్రప్రదేశ్‌ గత ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఈసారి మరింత జోష్‌తో ముందుకు సాగుతోంది.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. అన్ని పార్టీలు జట్టు కట్టినా.. సింగిల్‌గా విజయమే లక్ష్యం అంటుంది.. వైనాట్‌ 175 నినాదంతో ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధం అవుతోంది.. ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధం అయ్యారు.. ఇడుపులపాయ నుంచి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార భేరీకి శ్రీకారం చుట్టనున్నారు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌.. సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించేలా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది.. ప్రతి రోజూ ఒక జిల్లాలో ఉదయం వివిధ వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు వైఎస్ జగన్‌.. బస్సు యాత్ర పూర్తయ్యే వరకు ప్రజా క్షేత్రంలోనే ఉండనున్నారు ఏపీ ముఖ్యమంత్రి..

అయితే, ఎన్నికల షెడ్యూల్‌కు ముందే.. సిద్ధం పేరుతో నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహించి ఔరా! అనిపించింది వైసీపీ.. ఈ సభలతో ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు మరింత జోష్‌తో పనిచేసేలా పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.. ఇప్పుడు విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల మినహా మిగతా జిల్లాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర జరగనుంది. ప్రతి రోజూ ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగేలా ప్లాన్‌ చేశారు.. ఈ యాత్రలో ఉదయం వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు.. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.. ఇక, ఆ తర్వాత కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు సీఎం జగన్‌.. ఆ తర్వాత సాయంత్రం పార్లమెంట్‌ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

మొత్తంగా మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ నెల 27వ తేదీ అంటే ఎల్లుండి నుంచి కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్నారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు కూడా మళ్లీ అక్కడి నుంచి ఎన్నికల సంగ్రామానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగించనున్నారు.. ఎల్లుండి ఇడుపులపాయలో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సీఎం జగన్‌ ప్రొద్దుటూరుకు చేరుకోనున్నారు. ఎర్రగుంట్ల రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద సీఎం జగన్‌ విడిది చేస్తారు.. సాయంత్రం 4 గంటలకు శ్రీకన్యకాపరమేశ్వరి సర్కిల్‌, సినీ హబ్‌, ఆర్టీసీ బస్టాండ్‌, శివాలయం వీధి, రాజీవ్‌ సర్కిల్‌, కొర్రపాడు రోడ్డు మీదుగా బస్సు యాత్ర నిర్వహిస్తారు.. సాయంత్రం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు..

Exit mobile version