NTV Telugu Site icon

CM YS Jagan: కేబినెట్‌ భేటీలో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికలకు సిద్ధంకండి..

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్ష­తన జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. సచివాల­యం మొదటి బ్లాకులోని సమావేశ మం­దిరంలో జరిగిన ఈ సమావేశంలో.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. పలు కీలకమైన అంశాలకు ఆమోద ముద్ర కూడా లభించింది.. మూడున్నర గంటలపాటు 55 అంశాలపై ఈ భేటీ కొనసాగగా.. ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, భూ కేటాయింపులకు రాష్ట కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. అలాగే.. అసైన్‌మెంట్‌ ల్యాండ్‌ విషయంలో, నిరుపేదలకు ఇచ్చిన ల్యాండ్‌ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.. మరోవైపు కేబినెట్‌ సమావేశం అనంతరం మంత్రులతో కీలక అంశాలను ప్రస్తావించారు సీఎం వైఎస్‌ జగన్.

కేబినెట్‌ భేటీలో అజెండాలోని అంశాలపై చర్చ తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఎన్నికలకు సిద్ధంకండి అంటూ మంత్రులకు సూచించారు.. మరో 9 నెలల్లో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేసిన ఆయన.. జగనన్న సురక్షా క్యాంపైన్ ను మంత్రులు పర్యవేక్షించాలని తెలిపారు.. ఈ కార్యక్రమం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి.. గడప గడపకు మన ప్రభుత్వంపై కూడా మీ పర్యవేక్షణ ఉండాలి.. మంత్రులు మరింత బాధ్యతగా వ్యవహరించాలి.. సొంత జిల్లాల్లోనే కాకుండా ఇంఛార్జ్ జిల్లాల్లోనూ మంత్రుల పర్యటనలు, పర్యవేక్షణ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇక, జులై నెలలో చేపట్టనున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈనెల 18వ తేదీన జగనన్న తోడు.. ఈ నెల 20న సీఆర్డీఏ ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం.. ఈ నెల 21వ తేదీన నేతన్న నేస్తం కింద లబ్ధిదారులకు నిధులు జమ.. ఈనెల 26వ తేదీన సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బు జమ చేయనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. కాగా, ఇవాళ్టి కేబినెట్‌ భేటీలో వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం అమలుకు ఆమోదముద్ర వేసింది.. ఏపీ సీఆర్‌డీఏ (APCRDA)లో 47 వేల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్‌.. అసైన్డ్, లంక భూములపై హక్కులు కల్పించేలా ఆమోదం తెలిపింది మంత్రి మండలి.. ఇక, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన 22(A) లో ఉన్న భూములను నిషిద్ధ జాబితా నుంచి తొలగింపుకు ఆమోద ముద్ర పడింది.. యూనివర్సిటీల్లో శాశ్వత అధ్యాపకుల రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ ఆమోద ముద్ర వేసింది మంత్రి మండలి.. మరోవైపు.. SIPB ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..