NTV Telugu Site icon

CM YS Jagan: మార్పులు, చేర్పులపై జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. వారిపై అసంతృప్తి..!

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు, చేర్పుల వ్యవహారం కాకరేపుతూనే ఉంది.. అయితే, ఈ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రతిపార్టీకూడా సర్వేలు చేస్తుంది.. వాటి ఫలితాలు ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుందన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు.. కానీ, కొందరు స్థానిక నాయకులు విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారు.. అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు. చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం అన్నారు. ఇక, జాతీయ రాజకీయాల విషయంలో మావిధానం స్పష్టంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడం.. ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు సీఎం జగన్‌..

Read Also: CM YS Jagan: కాంగ్రెస్‌ ది డర్టీ గేమ్‌.. అప్పుడు మా చిన్నాన్న.. ఇప్పుడు నా సోదరి..

ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ మాట్లాడలేవు అని దుయ్యబట్టారు ఏపీ సీఎం.. ఇదే బడ్జెట్‌ గతంలోనూ ఉంది.. ఇప్పుడూ ఉంది.. కానీ, మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు.. అది ఈ ప్రభుత్వం మాత్రమే చేయగలిగిందన్నారు. రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ఉనికి పెద్దగా ఉండదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జగన్‌.. పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన మధ్యే ఉంటుంది అన్నారు.. మేం చేపట్టిన కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి పగడ్బందీ వ్యవస్థలు ఉన్నాయి.. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సమర్థవంతమైన యంత్రాంగాలు ఉన్నాయి..ముఖ్యమంత్రిగా నా దృష్టి ప్రత్యేకంగా ఉంటుందన్నారు. నేను ఏమీ హామీ ఇచ్చాను, నేనే ఏం చేశాను అన్నది చూడాలి.. మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశాను.. అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను.. ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత.. ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం.. వివక్ష లేకండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించామని తెలిపారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.