NTV Telugu Site icon

CM Revanth Reddy : వచ్చే వారం మేడిగడ్డలో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

మేడిగడ్డ బ్యారేజీలో కొనసాగుతున్న మధ్యంతర పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే వారం రానున్నారు. తన పర్యటనకు ముందు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం నీటిపారుదల శాఖ అధికారులు, మేడిగడ్డ బ్యారేజీ పనులను చేపట్టిన ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో సమీక్షించారు. మేడిగడ్డ బ్యారేజీపై మధ్యంతర చర్యల అమలుకు సంబంధించిన ఎన్‌డీఎస్‌ఏ సిఫార్సులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాను ముఖ్యమంత్రితో కలిసి బ్యారేజీ వద్దకు వస్తానని చెప్పారు. అయితే..

వానాకాలం లోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాలనే జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) మధ్యంతర నివేదికపై శనివారం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర జల వనరులసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ మూడు బ్యారేజీలకు వర్షాకాలం ప్రారంభానికి ముందు అత్యవసరంగా చేపట్టాల్సిన తాత్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనాలను సిఫారసు చేస్తూ గతంలో నివేదిక అందించింది. దీనిప్రకారం ఇప్పటికిప్పుడు మరమ్మతులు చేయడానికి రూ.100 కోట్ల దాకా అవుతుందని లెక్కలు కట్టారు. అయితే, నిధులు వెచ్చించినా మున్ముందు మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినదని కచ్చితంగా చెప్పలేమంటూ ఇచ్చిన నివేదికల నేపథ్యంలో తదుపరి ఏం చర్యలు చేపట్టాలనే దానిపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నారు.