CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్ధార్ సర్వాయి పాపన్నకు సముచిత గౌరవం ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. సర్ధార్ పాపన్న విగ్రహం ఏర్పాటు కోసం శంకుస్థాపన నిర్వహించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వం హుస్నాబాద్‌లోని పాపన్న కోటను లీజుకు ఇచ్చిందని, తాము అయితే ఆ కోటను సంరక్షించడానికి చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్‌ను పోటీ చేయించడం కూడా అదే భావనలోనుంచే జరిగిందని అన్నారు. సీఎం రేవంత్ గాంధీ కుటుంబాన్ని “దేశానికి గొప్ప వరం”గా అభివర్ణిస్తూ.. వారిచ్చే హామీ శిలాశాసనం లాంటిదేనని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ సూచించినట్లుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ దిశగా రాష్ట్రవ్యాప్తంగా కుల గణనను నిబద్ధతతో పూర్తి చేసామని, తాము చేసిన సర్వేలో తప్పు ఎక్కడ ఉందో చూపించమని అసెంబ్లీలోనే సవాల్ చేశామని ఆయన పేర్కొన్నారు.
రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తీసుకున్న రాజకీయ, న్యాయ చర్యలను సీఎం వివరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపినప్పటికీ అది ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉందని చెప్పారు. తాము తెచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారని, కేంద్ర స్థాయిలో దానికి ఆమోదం వచ్చేలా చూడాల్సిన కేంద్ర నేతలు వాదనలతో కాలం గడుపుతున్నారని ఆక్షేపించారు. 2018లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టమే ప్రస్తుతం 50 శాతం దాటి రిజర్వేషన్లు ఇవ్వడంలో అడ్డంకిగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
Mumbai Rains: జలదిగ్బంధంలో ఆర్థిక రాజధాని.. జనజీవనం అస్తవ్యస్తం
అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్లు ఉండవని స్పష్టం చేశారు. తాము పంపిన బిల్లు గానీ, ఆర్డినెన్స్ గానీ మతాధారిత రిజర్వేషన్లను ప్రతిపాదించలేదని సీఎం స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడమే లక్ష్యంగా “ముస్లిం” పేరుతో వాదనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. మైనార్టీల రిజర్వేషన్లు ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్ ఎలా అమలులో ఉన్నాయో కేంద్రం పరిశీలించాలని, అక్కడ తొలగించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై కోపం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవచ్చని, కేసులు పెట్టవచ్చని.. కానీ, ఆయన నమ్మిన బీసీ సాధికారత సిద్ధాంతాన్ని దెబ్బతీయొద్దని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో బీసీలు ముందుకు రావడం రాహుల్ గాంధీ లక్ష్యమని, ఆ సూచనలను అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
