NTV Telugu Site icon

CM Revanth Reddy: నేటి నుంచి సీఎం విదేశీ పర్యటన.. భారీ పెట్టుబడులే లక్ష్యం!

Cm Revanth Reddy

Cm Revanth Reddy

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 17 నుంచి 24 వరకు సింగపూర్, స్విట్జర్లాండ్‌ దేశాల్లో సీఎం పర్యటించనున్నారు. సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనల్లో పాల్గొననున్నారు. గురువారం రాత్రి 10 గంటలకు ఢిల్లీ నుంచి రేవంత్‌ రెడ్డి బృందం సింగపూర్‌కు బయలుదేరుతుంది. 17, 18, 19 తేదీల్లో సింగపూర్‌లో మూడు రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు.

ప్రపంచంలో పేరొందిన సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ని రేవంత్‌ రెడ్డి బృందం సందర్శిస్తుంది. నైపుణ్య అభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో సీఎం ఒప్పందం చేసుకుంటారు. సింగపూర్‌లో రివర్ ఫ్రంట్‌ను సందర్శిస్తారు. ప్రపంచ స్థాయిలో మూసీ పునరుజ్జీవనం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నందున అక్కడి రివర్ ఫ్రంట్ ఏరియా అభివృద్ధి చేసిన తీరుతెన్నులను పరిశీలిస్తారు.

సింగపూర్ పర్యటన అనంతరం సీఎం బృందం 20వ తేదీ ఉదయం దావోస్‌కు చేరుకుంటుంది. 20వ నుంచి 22 వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు 2025లో పాల్గొంటారు. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తోంది. గత ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈ సారి అంతకు మించిన పెట్టుబడుల లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులతో సమీక్షలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులతో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Thummala Nageswara Rao: ఖమ్మం మార్కెట్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చి దిద్దుతా!

ఇప్పటికే గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారింది. ఐటీ, ఏఐ, ఫార్మా, మాన్యుఫాక్చరింగ్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలతో పాటు ఇటీవల ప్రకటించిన పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విధానం (క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ)పై ప్రముఖ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, వరల్డ్ క్లాస్ సిటీగా గ్రేటర్ సిటీలో ఎలివేటేడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తొలి ఏడాదిలో చేపట్టిన విదేశీ పర్యటనలన్నీ విజయవంతమయ్యాయి. గత ఏడాది దావోస్ పర్యటనతో పాటు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. దేశంలో అద్భుతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న తెలంగాణకు భారీగా పెట్టుబడులు సమీకరించే లక్ష్యంతో సీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ విదేశీ పర్యటనకు బయల్దేరుతోంది. మూడు రోజుల దావోస్‌ పర్యటన అనంతరం 24న హైదరాబాద్‌కు సీఎం బృందం చేరుకుంటుంది.

Show comments