CM Revanth Reddy: మేడారంలో సమ్మక్క సారలమ్మలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా మంత్రులతో కలిసి సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు ముఖ్యమంత్రి నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ 75 రోజుల పాలన గురించి వివరించారు. రాబోయే రోజుల్లో ప్రజా ఆకాంక్షల మేరకే పని చేస్తామని తెలిపారు. మేడారం ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.. ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ స్కీమ్ గ్యారంటీలను ఫిబ్రవరి 25వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు.
Read Also: Transfer of IAS: తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీలు
నీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి గురించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించబోతున్నామని.. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే తీపికబురు చెబుతామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను సకాలంలో అందించేలా, ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని వివరించారు. పరిపాలనను గాడిలో పెడుతున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేస్తున్నామన్నారు. జర్నలిస్టుల సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే మీడియా అకాడమీ ఛైర్మన్‌ను కూడా నియమిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నిపుణుల సూచనల మేరకు ముందుకెళ్తామన్నారు. మేడారం జాతర కోసం ఆరు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మహిళలకు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. గురువారం రోజున మేడారంలో కీలక ఘట్టం ప్రారంభమైంది. సమ్మక్క తల్లి గద్దెపై కొలువు దీరింది. సమ్మక్కను ప్రధాని పూజారి ప్రతిష్టించారు. వనదేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చిలకలగుట్టనుంచి సమ్మక్క తల్లి మేడారం గద్దెపైకి చేరడంతో మహాజాతర పరిపూర్ణత సంతరించుకుంది. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరడంతో భక్తుల మొక్కులు జోరందుకున్నాయి.