NTV Telugu Site icon

CM Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తయి పదకొండవ సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

Read Also: CM Revanth Reddy: సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దేశంలో కాంగ్రెస్‌దే అధికారం..

ఈ ఏడాది జూన్ 2వ తేదీకి అత్యంత ప్రాధాన్యముందని, ఈ రోజుతో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించిందని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తపరిచారు. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందని గుర్తు చేశారు. ఇకపై విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సింహభాగం మన రాష్ట్ర ప్రజలకే దక్కుతాయని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి ప్రతిన బూనారు.

గడిచిన పదేండ్లలో తెలంగాణలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు, ఇంతకాలం కోల్పోయిన ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజా పాలనను అందిస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్తు ప్రణాళికలు, సరికొత్త విధానాల రూపకల్పన మొదలైందని తెలిపారు.