Telangana Assembly News: శాసనసభలో కాళేశ్వరం కమిషన్‌పై చర్చ మొదలైంది. సభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడిన దానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంపూర్తి సమాచారంతో హరీష్ రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆనాడు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఈనాటికీ మంత్రిగా ఉన్నట్లుగానే భావిస్తున్నారని అన్నారు. నీరు అందుబాటులో ఉందని చెప్పినా మళ్లీ పరిశీలించాలని లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారిని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మించుకుంటామని వాదించకుండా.. పేరు మార్చి ఊరు మార్చి బీఆర్ఎస్ వాళ్లు దోపిడీకి పాల్పడ్డారన్నారని విమర్శించారు. 2014 లో నీరు అందుబాటులో ఉందని చెప్పిన విషయం దాచి 13 మార్చి 2015 న ఉమా భారతి లేఖను పట్టుకుని హరీష్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విద్యాసాగర్ రావు బతికి ఉంటే వీళ్ల అబద్ధాలు వినలేక అదే కాళేశ్వరంలో దూకి ఆత్మహత్య చేసుకునేవారని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదని, ఎత్తు తగ్గించుకోవాలని మాత్రమే వాళ్లు సూచించారని అన్నారు. నిజాం కంటే ధనవంతుడు కావాలన్న దుర్బుద్ధితో కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ చేశారని విమర్శించారు. మేడిగడ్డ దగ్గర కట్టాలని కేసీఆర్, హరీష్ ముందే నిర్ణయించుకున్నాక రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీని నియమించారని, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక వారికి అనుకూలంగా రాకపోవడంతో ఆ నివేదికను తొక్కిపెట్టి వాళ్లు అనుకున్న చోట ప్రాజెక్టు కట్టారని చెప్పారు. వీళ్ల ఉద్దేశమే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు తరలించడమని, వీళ్ల ప్రణాళికలకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అడ్డు చెబితే ఆ నివేదికను కనిపించకుండా మాయం చేశారని చెప్పారు.
READ ALSO: Ustaad Bhagat Singh : ఉస్తాద్ నుంచి భారీ అప్డేట్.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్
పేజీ నెంబర్ 98 లో స్పష్టంగా పొందుపరిచారు..
హరీష్ రావు తప్పు చేశారని నివేదికలోని పేజీ నెంబర్ 98 లో స్పష్టంగా పొందుపరిచారని చెప్పారు. అసంపూర్తి సమాచారంతో సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి సర్టిఫికెట్ తీసుకున్నాక మళ్లీ పరిశీలించాలని ఎవరైనా అడుగుతారా అని ప్రశ్నించారు. 2009 లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నీరు అందుబాటులో ఉందని అనుమతి నిచ్చింది. ఈ రికార్డులను కావాలనే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తొక్కిపెట్టిందని అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో వాస్తవాలని బయటపెట్టారనే వారిపై విషం చిమ్ముతున్నారని చెప్పారు. తప్పుడు పనులు చేసి లక్ష కోట్లు కొట్టేయాలని చూశారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం విమర్శలు గుప్పించారు.
READ ALSO: Kaleshwaram Report: కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధం: హరీష్ రావు
