NTV Telugu Site icon

CM Revanth Reddy : విజయవంతంగా ముగిసిన దావోస్ పర్యటన

Revanth Reddy

Revanth Reddy

ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతమైంది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు. అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్‌ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ ఫోరమ్ లలో మాట్లాడారు. చిన్న మరియు సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు. మరో సదస్సులో మాట్లాడుతూ హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ ను సాఫ్ట్ వేర్ తో సమ్మిళితం చేయాలన్నారు. ఖరీదైన హెల్త్ కేర్ సేవల ఖర్చులను తగ్గించేందుకు అమెరికా, యూరప్ దేశాలు పని చేస్తున్నాయని అన్నారు. హెల్త్ కేర్ సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు, అధునాతన వైద్య సేవలను ప్రతి మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరుకోడానికి డిజిటల్, సాంకేతికను ఉపయోగించాలని సీఎం అన్నారు.

ముఖ్యమంత్రితో సమావేశమైన భారతీయ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లందరూ తెలంగాణలో కొత్త ప్రభుత్వం అనుసరించిన వ్యాపారం, స్నేహ దృక్పథానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. దావోస్‌కు రావడం.. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవటం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు, వృద్ధి కలిసి రావాలి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం మా ప్రయత్నం కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్ కు రావాలి…‘ అని స్వాగతం పలికారు.

Show comments