Site icon NTV Telugu

CM Revanth Reddy : తీన్మార్‌ మల్లన్నను గెలిపించేందుకు పనిచేయాలి

Revanth Reddy

Revanth Reddy

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున బరిలో దిగిన తీన్మార్ మల్లన్నను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కాంగ్రెస్‌ అభ్యర్ధి తీన్మార్‌ మల్లన్నను గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి దిశనిర్దేశం చేశారు. ఇవాళ రాత్రి సీఎం రేవంత్‌ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జిలు, అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జిలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 27న పోలింగ్ ఉన్నందున క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, మండల స్థాయి నాయకులను సన్నద్ధం చేయాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లను సందర్శించాలన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని, తీన్మార్ మల్లన్నఎన్నిక, కాంగ్రెస్ పార్టీ ఎన్నికగా పని చేసి గెలుపునకు పని చేయాలన్నారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులకు సూచించారు.

Exit mobile version