ఎంసీహెచ్ఆర్డీలో ‘గవర్నర్పేట్ టు గవర్నర్స్ హౌజ్’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరుకావడం ఒక మంచి అవకాశంగా భావిస్తున్నానన్నారు. 76 సంవత్సరాల్లో అన్నింటిపై అవగాహన పొందిన పెద్దలందరిని ఇక్కడ కలుసుకోవడం గొప్ప అనుభూతి అని, జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంగా తగ్గుతోందన్నారు. గతంలో సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారన్నారు. వారి తరువాత జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు ఆ స్థాయిని కొంతవరకు నిలబెట్టారని, కానీ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
అంతేకాకుండా.. ‘ఇది మన మనుగడకు, గుర్తింపునకు మంచి పరిణామం కాదు. మనవాళ్లుగా మనమంతా కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. జాతీయ రాజకీయాల్లో కూడా ఆ స్థాయి ఉండాల్సిన అవసరం ఉంది. కేంద్ర కేబినెట్ లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి. మీలాంటి అనుభవజ్ఞుల నుంచి మా ప్రభుత్వం సూచనలు తీసుకుంటుంది. గతంలో నంద్యాలలో పీవీ పోటీ చేసినపుడు.. తెలుగువాడు ప్రధానిగా ఉండాలని ఎన్టీఆర్ పీవీపై తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టకుండా ఏకగ్రీవం చేసే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు ఒక మంచి సంప్రదాయాన్ని పాటించడంలో తప్పులేదు. మా ప్రభుత్వం కూడా అలాంటి మంచి సంప్రదాయాన్ని పాటిస్తుంది.. రాష్ట్రాలుగా విడిపోయినా మనుషులుగా మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అభివృద్ధిని ప్రజల చెంతకు చేరవేయడానికి మేం మా వంతు కృషి చేస్తాం.. ఇందుకు మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నా..’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
