NTV Telugu Site icon

CM Revanth Reddy : వైద్యం అందించడం ఒక సామాజిక బాధ్యత

Medicover

Medicover

తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనకు గణనీయ ప్రోత్సాహకంగా వరంగల్‌లో 300 పడకల సూపర్ స్పెషాలిటీ మెడికోవర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ హాస్పిటల్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్య, వైద్యం, విద్యుత్ అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమవుతుందని, హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందిందన్నారు సీఎం రేవంత్‌. ఫార్మారంగం ఎప్పుడు చర్చకు వచ్చినా అందులో హైదరాబాద్ కు స్థానం ఉంటుందని, ఇందుకు కారణం ఇందిరాగాంధీ దూర దృష్టి అని ఆయన వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీ చొరవతో తెలంగాణలో ఐటీ రంగం రాణించిందని, తెలంగాణను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

అంతేకాకుండా.. ‘రాష్ట్రంలో ఫార్మా అభివృద్ధికి ఫార్మా విలేజెస్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శందాబాద్ లో వెయ్యి ఎకరాల్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని రకాల వైద్య సేవలు అందించేలా మెడికల్ టూరిజం హబ్ ఉండాలి. రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. మా ఆలోచనను ముందుకు తీసుకెళ్లేందుకు సాంకేతికంగా మీ సహాయం కోరుతున్నాం. ఆసుపత్రికి ఎంతమంది వచ్చారని కాదు.. ఎంతమంది నవ్వుతూ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లారనేది ముఖ్యం. వైద్యం అందించడం ఒక సామాజిక బాధ్యత. డబ్బుల కోణంలో కాదు సేవ చేయాలనే దృక్పథంతో పనిచేయాలి. నగరానికి త్వరలో ఎయిర్ పోర్ట్ రాబోతోంది, టెక్స్టైల్ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. వరంగల్ లో హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం.’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.