Site icon NTV Telugu

CM Revanth Reddy: పాశమైలారం పరిశ్రమ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. రేపు ఘటనా స్థలం సందర్శన

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్పందించిన ఆయన, బాధితుల కుటుంబాలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (జులై 1) ఉదయం 10 గంటలకు స్వయంగా ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు. సహాయక చర్యల పురోగతిపై ఎప్పటికప్పుడు మంత్రి దామోదర రాజనర్సింహ, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడుతూ సమీక్షించారు.

Read Also:DRDO: బంకర్-బస్టర్ బాంబుల తయారీకి భారత్ అడుగులు.. దీని ప్రత్యేకత ఏంటి..?

అలాగే ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు మరింత వేగంగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీను ఏర్పాటు చేశారు. ఇందులో సీఎస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ సీఎస్, లేబర్ డిపార్టుమెంట్ పీఎస్, హెల్త్ సెక్రటరీ, అడిషనల్ డీజీ (ఫైర్ సర్వీసెస్) ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు తక్షణ సాయం అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు ఆసుపత్రులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

Read Also:Team India Schedule: ఇంగ్లండ్ పర్యటనలో మూడు భారత జట్లు.. జులై షెడ్యూల్ ఇదే!

ఇప్పటివరకు 15 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీసినట్లు తెలుస్తుంది. అయితే, ఈ సంఖ్యపై స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది. వీరిలో ముగ్గురి వివరాలే ఇప్పటివరకు గుర్తించగలిగారు. మిగిలిన 12 మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల అనంతరం కుటుంబాలకు అప్పగించనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఐదుగురి పరిస్థితి తీవ్రంగా ఉంది. అంతేగాక, శిథిలాల కింద ఇంకా 15 మంది కార్మికులు ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సహాయక చర్యలు మరింత ముమ్మరంగా చేపట్టడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా.. ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

Exit mobile version