NTV Telugu Site icon

CM Revanth Reddy: ఢిల్లీలో బిజీబిజీగా సాగుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్, పర్యాటక శాఖకు సంబంధించి రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం అటవీ భూముల అనుమతులపై చర్చించారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రి కొండా సురేఖ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసి, రాష్ట్రం నుంచి పంపించిన ప్రతిపాదనలను త్వరగా ఆమోదించాలని కోరారు. భూపేందర్ యాదవ్ సానుకూలంగా స్పందించారు.

కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమైన సీఎం రేవంత్, తెలంగాణలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటు, భారీ పరిశ్రమల ప్రోత్సాహకాలపై చర్చలు జరిపారు.

పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ బృందం విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. తొలిదశలో సింగపూర్‌కు వెళ్లి, మూడు రోజుల పాటు అక్కడ పర్యటిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను సందర్శించి, నైపుణ్య అభివృద్ధి కోర్సులు, విధానాలపై అధ్యయనం చేయనున్నారు. తెలంగాణలో ఇటీవల ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకుంటారు.

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ కోసం సింగపూర్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి మోడల్‌ను పరిశీలించనున్నారు. అలాగే, సింగపూర్ పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులపై చర్చలు జరుపుతారు.

సింగపూర్ పర్యటన అనంతరం జనవరి 20న స్విట్జర్లాండ్‌కు వెళ్తారు. జనవరి 20-22 మధ్య దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరమ్ సదస్సులో పాల్గొని, ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. గతంలో అమెరికా, దక్షిణ కొరియా, దావోస్ పర్యటనల ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించిన సీఎం రేవంత్, ఈ పర్యటనల ద్వారా తెలంగాణ ఆర్థిక వృద్ధికి మరింత బలం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Tabu: యంగ్ హీరోయిన్లను తలదన్నేలా సీనియర్ హీరోయిన్.. ఎక్కడా తగ్గట్లేదుగా!