Site icon NTV Telugu

CM Revanth Reddy : ఆర్టీసీ సిబ్బందిని అభినందించిన సీఎం రేవంత్‌ రెడ్డి

Cm Revanth Reddy

Cm Revanth Reddy

కరీంనగర్ బస్ స్టేషన్‌లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్‌ఆర్టీసీ మహిళా సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.  ‘కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న  #TGSRTC మహిళా సిబ్బందికి నా అభినందనలు.  మీరు సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. విధి నిర్వహణలో కూడా మీరు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.’ అని ఆయన ట్వీట్టర్‌ (X) వేదికగా పేర్కొన్నారు.  ఊరెళ్దామని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చిన ఓ గర్భిణికి అక్కడే నొప్పులు మొదలవడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలు అడ్డుపెట్టి డెలివరీ చేశారు. 108 వచ్చే లోపు సాధారణ ప్రసవం చేసి తల్లిని, బిడ్డను ఆసుపత్రికి తరలించారు.

 

ఒడిశాకు చెందిన వలస కూలీ కుమారి ఆమె భర్త దూలతో కలిసి పెద్దపల్లి జిల్లా కాట్నల్లి ఇటుక బట్టీలో పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం కుంట వెళ్దామని కరీంనగర్  ఆర్టీసీ బ‌స్టాండ్‌లో భద్రాచలం బస్సు ఎక్కేందుకు వచ్చారు. కుమారి నిండు గర్భిణి కాగా, ఆమెకు బస్టాండ్‌లోనే నొప్పులు రావడం మొదలైంది. అయితే..  వెంటనే గర్భిణీ  భర్త ఆమెను పక్కన పడుకోబెట్టి సాయం కోసం ఆర్టీసీ అధికారులకు విషయం చెప్పడంతో , వారు 108కు సమాచారమిచ్చారు.

 

ఈలోగా నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా స్వీపర్లు, సూపర్‌వైజర్లు ముందుకు వచ్చారు. చీరలను అడ్డుపెట్టి సాధారణ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. కొద్దిసేపటికి  108 అంబులెన్స్ రాగానే తల్లీబిడ్డలను కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. గర్భవతికి అండగా నిలిచిన ఆర్టీసీ సిబ్బందిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

 

 

Exit mobile version