NTV Telugu Site icon

Indiramma houses: ఇందిర‌మ్మ ఇళ్లకు ఇసుక స‌ర‌ఫ‌రాపై అధ్యయ‌నం.. క‌మిటీ నియామ‌కం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

ఇందిర‌మ్మ ఇళ్లకు ఇసుక ఏ విధంగా స‌ర‌ఫ‌రా చేయాల‌నే దానిపై అధ్యయ‌నం చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధ్యయ‌న క‌మిటీ స‌భ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యద‌ర్శి రామ‌కృష్ణారావు, గ‌నుల శాఖ ముఖ్య కార్యద‌ర్శి ఎన్‌. శ్రీ‌ధ‌ర్‌, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ క‌మిష‌న‌ర్ శ‌శాంక‌, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్‌ల‌ను నియ‌మించారు. ఈ క‌మిటీ వారంలోపు త‌మ అధ్యయ‌నాన్ని పూర్తి చేసి స‌మ‌గ్ర విధివిధానాల‌తో నివేదిక స‌మ‌ర్పించాల‌ని సీఎం ఆదేశించారు. ఇందిర‌మ్మ ఇళ్లకు ఇసుక స‌ర‌ఫ‌రా, గ‌నుల శాఖపై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మాణం ప్రారంభించ‌నున్న నేపథ్యంలో ల‌బ్ధిదారుల‌కు ఇసుక ఏవిధంగా స‌ర‌ఫ‌రా చేయాల‌నే దానిపై స‌మ‌గ్రంగా అధ్యయ‌నం చేయాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌కు సూచించారు.

Read Also: Rahul Gandhi: ఒకప్పుడు చిన్నకారు.. ఇప్పుడు శీష్‌మహల్.. కేజ్రీవాల్‌పై రాహుల్‌గాంధీ విమర్శలు

రాష్ట్రంలో ఏటేటా నిర్మాణాలు పెరుగుతున్నా.. ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆదాయం ఆశించినంత రావ‌డం లేద‌ని, అదే స‌మ‌యంలో వినియోగ‌దారులు ఎక్కువ ధ‌ర‌కే ఇసుక కొనుగోలు చేయాల్సి వ‌స్తోంద‌ని సీఎం అన్నారు. వినియోగ‌దారుల‌కు త‌క్కువ ధ‌ర‌కే ఇసుక ద‌క్కేలా చూడాల‌ని.. అదే స‌మ‌యంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇసుక మాఫియాను అరిక‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సీఎం ఆదేశించారు. మేజ‌ర్‌, మైన‌ర్ ఖ‌నిజాల గ‌నుల‌కు వేసిన జ‌రిమానాలు వ‌సూళ్లు కాక‌పోవ‌డంపైనా అధికారుల‌ను సీఎం ప్రశ్నించారు. మేజ‌ర్‌, మైన‌ర్ ఖ‌నిజ విధానంపై స‌మ‌గ్రంగా అధ్యయ‌నం చేసి రెండు వారాల్లో నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధ్యయ‌న క‌మిటీని సీఎం ఆదేశించారు. ఈ స‌మీక్షలో రాష్ట్ర గృహ‌నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యద‌ర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యద‌ర్శి మాణిక్ రాజ్ పాల్గొన్నారు.

Read Also: Ind vs Eng 3rd T20: అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి .. భారత్ టార్గెట్ ఎంతంటే..?