Site icon NTV Telugu

CM Revanth Reddy : ప్రపంచంలోని సమస్యలకు ప్రజాస్వామ్యమే పరిష్కారం

Revanth

Revanth

లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లను కలుసుకున్నారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘భారత్ మరియు బ్రిటన్ మధ్య బలమైన బంధాలలో ఒకటైన ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే అత్యవసరం…’అన్నారు.

వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ ను యునెస్కో 1016 సంవత్సరంలోనే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ చారిత్రక భవనంలో జరిగిన సమావేశంలో లేబర్ ఎంపీ వీరేంద్ర శర్మతో పాటు మరో ఏడుగురు ఎంపీలు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. హింస, ఉగ్రవాదం, ప్రజల హక్కుల హరణ, ప్రజాస్వామ్యంపై దాడి లాంటి సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటోంది. కేవలం ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలను శక్తిమంతులను చేయటమే అసలైన పరిష్కారం.‘ అన్నారు.

ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ‘ఒకప్పుడు మీ దేశం మా దేశాన్ని పరిపాలించింది. మా కాంగ్రెస్ పార్టీనే మీకు వ్యతిరేకంగా పోరాడింది. అప్పుడు మహాత్మ గాంధీ ఎంచుకున్న సత్యం, అహింస, న్యాయ పోరాటమే మీ దేశానికైనా మా దేశానికైనా ఇప్పటికీ మార్గదర్శకాలు…‘ అన్నారు.

ఇదే సందర్భంగా తన స్వీయ అనుభవాలను సీఎం పంచుకున్నారు. ‘నాది గ్రామీణ ప్రాంతం. నేను సామాన్య రైతు బిడ్డను. కేవలం ప్రజాస్వామ్యం వల్లనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. నేనున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య భావనను నరనరాన జీర్ణించుకున్న పార్టీ. నాకు ఈ అవకాశం వచ్చినట్లే.. దేశంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందే అవకాశం ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తేనే సాధ్యమవుతుంది…’ అన్నారు.

Exit mobile version