నల్గొండ ప్రజల కోసమే మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు చెప్పారని.. ఎవరెన్ని సమస్యలు సృష్టించినా సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్య మాత్రమే కాకుండా.. నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కూడా తీరుతుందన్నారు. సబర్మతి, యమునా, గంగా నది ప్రక్షాళన జరగొచ్చు కానీ.. మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? అని సీఎం ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా ఉస్మాన్‌సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టు పనులకు సీఎం ఈరోజు శంకుస్థాపన చేశారు. రూ.7,360 కోట్లతో హ్యామ్ విధానంలో పనులు చేయనున్నారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
తాగునీటి సరఫరా పథకంకు శంకుస్థాపన అనంతరం సీఎం మాట్లాడుతూ… ‘నల్లగొండ జిల్లాలో మూసీ నది కాలుష్యానికి మారు పేరుగా మారింది. ఆ నీరు త్రాగి పశువుల ప్రాణాలే కాదు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. మూసీ నది నీటి వల్ల ఆడబిడ్డలకు పురిటి సమస్యలకు కారణం అవుతుంది. నల్లగొండ జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ పరిస్థితి చూసి మూసీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నా. హైదరాబాద్ నగరంలో డ్రైనేజీల నీరు, కంపెనీల కాలుష్యం మూసీలో కలవకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీలు పెట్టడం జరిగింది. నరేంద్ర మోదీ గంగా నది ప్రక్షాళన చేశారు. సబర్మతి, యమునా, గంగా నది ప్రక్షాళన జరగొచ్చు కానీ.. మూసీ నది ప్రక్షాళన జరగొద్దా?’ అని ప్రశ్నించారు.
Also Read: Revanth Reddy: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం!
‘గేట్ వే ఆఫ్ డిల్లీ, గేట్ వే ఆఫ్ ముంబై ఉంది. ఇప్పుడు గేట్ వే ఆఫ్ హైదరాబాద్ కూడా ఉంటది. హైదరాబాద్ అభివృద్ధికి అందరూ కలిసి రావాలి. అందుకు మీ అందరి సహకారం కావాలి. రాబోయే రోజుల్లో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విదంగా చేద్దాం. ఎవరు అడ్డుకున్నా మన ప్రభుత్వం తిప్పి కొడుతుంది అన్నట్లు చేద్దాం. ఇది ఇందిరమ్మ రాజ్యం, పేద్దోళ్ల రాజ్యం. పేదోళ్లకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. బీఆర్ఎస్ వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగింది. మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదో చెప్పాలి?’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
