CM KCR: ఎన్నికలలో నిలబడే వివిధ రాజకీయ పార్టీల నాయకుల గుణగణాలు తెలుసుకుని ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల భవిష్యత్ చూసి బీఆర్ఎస్‌కు ఓటు వేసి, ఎమ్మెల్యేగా కోరుకంటి చందర్‌ను గెలిపించాలన్నారు. అప్పులలో ఉన్న సింగరేణి సంస్థను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పునరుద్ధరించుకున్నామన్నారు. సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలు, కార్మికుల హక్కులను పొగొట్టింది కాంగ్రెస్ పార్టీ అంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సింగరేణిలో 15 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్‌కు చెందుతుందన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.
Also Read: Singireddy Vasanthi: అభివృద్ధే లక్ష్యం.. మంత్రి నిరంజన్ రెడ్డిని మరొకసారి ఆశీర్వదించాలి..
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి పన్నులు లేకుండా 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని, రైతు బంధు, రైతు బీమా అందిస్తున్నామన్నారు. ధరణి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని.. సింగరేణి సాధించిన లాభాలలో కార్మికులకు 32శాతం వాటా ఇచ్చామన్నారు. సింగరేణి సంస్థ కార్మికులకు ఇన్‌కమ్ టాక్స్ వంద శాతం రద్దు చేస్తామన్నారు. ఈ ప్రాంతానికి అవసరమైన పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.
