కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75సంవత్సరాలు అయిన ఇంకా పరిణితి రాలేదన్నారు. ఏ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉందో అవి అభివృద్ధి చెందాయని, ఎమ్మెల్యే గురించి ప్రజలు ఆలోచన చేయాలన్నారు సీఎం కేసీఆర్. గుణ, గణాలు, మంచి చెడు చూడాలని, ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మిగితా రెండు పార్టీల చరిత్ర గురించి ఆలోచన చేయాలని, మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే మల్ల వచ్చే వరకు ఇల్లు కాలిందంట అంటూ ఆయన ప్రత్యర్థ పార్టీలపై సెటైర్లు వేశారు.
అంతేకాకుండా.. ‘ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పార్టీ కాంగ్రెస్. 1969లో 400మంది ప్రాణాలు బలి తీసుకున్న పార్టీ. 2004లో కాంగ్రెస్ వచ్చింది.. వారితో పొత్తు పెట్టుకొని గెలిపించాం. తెలంగాణ ఇస్తామని చెప్పి అప్పుడు మోసం చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చి పదేళ్లు అయింది. దేశం మొత్తానికి 150మెడికల్ కళాశాలలు వచ్చాయి. నేను మెడికల్ కళాశాల కోసం వంద ఉత్తరాలు రాశా. నవోదయ పాటశాలల కోసం వంద లెటర్లు రాసిన. ఒక్క మెడికల్ కళాశాల, ఒక్క నవోదయ పాటశాల ఇవ్వని బిజెపికి ఎందుకు ఓటు వెయ్యాలి. మోటర్లకు మీటర్లు పెట్టాలని మోది చెప్పిండు. మీటర్లు పెట్టకుంటే రాష్ట్రానికి రూ.25వేల కోట్లు కోత పెట్టిండు. రైతు బంధు వేస్ట్ అని కాంగ్రెస్ వాళ్లు అంటుర్రు. రూ.16వేల రైతు బంధు కావాలంటే కౌశిక్ రెడ్డిని గెలిపించాలి. రేవంత్ మూడు గంటల కరెంట్ చాలు అంటుండు.
24గంటల కరెంట్ రావాలంటే కౌశిక్ రెడ్డిని గెలిపించాలి. ధరణి బంద్ అయితే, రైతు బంధు ఎట్ల వస్తుంది.. ఏ ఆఫీస్ కు వెళ్లకుండా ఖాతాలో రైతు బంధు డబ్బులు పడుతున్నాయి. ధరణి తీసివేస్తే అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మళ్ళీ పాత రోజులు వస్తాయి. హుజూరాబాద్ లో ఉన్న మేధావులు ఆలోచన చేయాలి. బీజేపీ ఆయన గెలిస్తే ఏమవుతుంది. పెద్ద పెద్ద మాటలు తప్ప జరిగేది ఏం లేదు. వందకు వంద శాతం బీఆర్ ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఆలాంటప్పుడు కౌశిక్ రెడ్డిని గెలిపిస్తే అన్ని వస్తాయి. కౌశిక్ రెడ్డి యువకుడు, ఉత్సాహ వంతుడు. ఒక్క సారి అవకాశం ఇవ్వాలి. కౌశిక్ రెడ్డి నా కొడుకు లాంటి వాడు. కొన్ని మండలాలు కావాలని అడిగిండు. ఈటల రాజేందర్ రాకముందే సాయినాథ్ రెడ్డి బీఆర్ ఎస్ లో ఉన్నాడు. ఇంకా కొన్ని కూడా అడిగిండు, అవి అన్నీ చేసేవే. పాలు ఇచ్చే బర్రెను వదిలి దున్నపోతు తెచ్చుకుంటామా చెప్పాలి.’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.