NTV Telugu Site icon

CM KCR : చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తాం

Kcr

Kcr

జనగామ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్‌ పర్యటించారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. అయితే.. ఈ సభలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పొన్నాల లక్ష్మయ్యకు సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. జనగామ, భువనగిరి గ్రోత్‌ కారిడార్‌లుగా మారాయి. పాత వరంగల్‌ జిల్లాలో అత్యధికంగా వడ్లు పండించే తాలూక జనగామ అని, చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

అంతేకాకుండా.. ‘ఎన్నికలు రాగానే నోటికి వచ్చినట్లు మాట్లాడి వెళ్లిపోతారు. దేవాదుల, కాళేశ్వరం నుంచి నీళ్లు రాబోతున్నాయి. ఎక్కడ కరువు వచ్చినా, జనగామలో మాత్రం రాదు. గులాబీ జెండా ఎగరగానే చంద్రబాబు వెళ్లి దేవాదులకు శంకుస్థాపన చేశారు. మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రం వచ్చాక మూడు నాలుగు నెలలు మేథోమధనం చేశాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చలు చేశాం. ఇప్పుడు తెలంగాణ ఎలా ఉంది. కరెంట్‌ కష్టాలు లేవు, నీటి కొరత లేదు, పుట్లకొద్ది పంటలు పడుతున్నాయి. భూమిపై రైతుల హక్కులు వారికే ఉండాలి.

రైతుల బాధ నాకు తెలుసు, అందుకే భూమిపై అధికారుల అధికారాన్ని తీసేశాం. మీ భూమి మీద అధికారాన్ని మీకే ఇచ్చాం. పాస్‌బుక్‌లో కాంగ్రెస్‌ వాళ్లు కౌలు రైతులను చేర్చాలంటున్నారు. నా ప్రాణం పోయినా సరే అది మారనివ్వను. టీపీసీసీ చీఫ్‌, సీఎల్పీ నేత భట్టి ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తారట. కాంగ్రెస్‌కు ఓటు వేసే వేస్తే వీఆర్‌వోలు వస్తారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్‌ ఇస్తామంటున్నారు. 24 గంటలు కరెంట్‌ కొనసాగాలంటే కాంగ్రెస్‌ను శిక్షించాలి. రైతు బీమా తరహాలో రాష్ట్రంలో అందరికీ బీమా వర్తింపు. సహజ మరణమైనా సరే రూ. 5లక్షలు ఇస్తాం. ‘ అని సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.

CM KCR Live : BRS Jangaon Public Meeting LIVE | Ntv Live