తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు మేనియా నడుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో జోరు పెంచింది. ఈ నేపథ్యంలో నేడు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చండూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్ మునుగోడు ఓటర్లనుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే.. ఇటీవల మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యే కోనుగోలు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ స్పందించలేదు. అయితే.. ఈ రోజు బహిరంగ సభలో ఈ విషయంపై కూడా స్పందిస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : South Korea: హాలోవీన్ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 150 మంది మృతి
ఇదిలా ఉంటే.. మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో సభ ప్రారంభం కానుంది. ఈ సభకు పార్టీ నేతలు ఇప్పటికే భారీ జనసమీకరణ చేశారు. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు.. బహిరంగసభకు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తుండటంతో భారీగా ప్రజలు తరలివస్తారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. సీఎం రాకకోసం హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ వచ్చే నెల 3న జరుగనుంది. అలాగే 6న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు అధికారులు.