CM K.Chandrashekar Rao : గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అహింస, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి విజయం సాధించి చూపటం ద్వారా ప్రపంచానికి సరికొత్త పోరుబాటను మహాత్మా గాంధీ పరిచయం చేశారన్నారు. గాంధీ ఆచరించిన బాటలో పయనించిన ఎన్నో దేశాలు బానిసత్వం నుంచి విముక్తి పొందాయని తెలిపారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహా పురుషుడు అని కీర్తించారు. గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.
Gandhi Jayanti: జాతిపిత గాంధీకి భారతావని ఘన నివాళి
దేశ ప్రజలను స్వాతంత్రోద్యమంలో కార్యోన్ముఖులను చేసిన మహాత్మ జీవితం అన్ని కాలాల్లోనూ ఆదర్శప్రాయమైందని సీఎం కేసీఆర్ అన్నారు. అంతిమ విజయం సత్యానిదే అని చాటి చెప్పారని ఆయన పేర్కొన్నారు. గుంపులో ఒకరిగా ఉండటం తేలికే కానీ, ఒంటరిగా నిలబడడానికి ధైర్యం కావాలి అన్న గాంధీ మాటలే ప్రేరణగా తెలంగాణ రాష్ట్రం హక్కుల సాధనకోసం ముందడుగు వేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.