NTV Telugu Site icon

Munugode Bypoll: మునుగోడు అభ్యర్థికి బీఫాం ఇచ్చిన కేసీఆర్.. ఎన్నికల ఖర్చుకోసం ఎంత ఇచ్చారంటే?

Kcr

Kcr

Munugode Bypoll: మునుగోడులో ఇవాళ్టి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫాంను ప్రగతిభవన్‌లో అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును ఇచ్చారు. తనకు అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కూసుకుంట్ల ఈ సందర్భంగా కృతజ్జతలు తెలిపారు. పార్టీ నిధి నుంచే ఈ మొత్తాన్ని ప్రభాక‌ర్ రెడ్డికి కేసీఆర్ అందించిన‌ట్లు టీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ ఖాతా తెలిపింది. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు,మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు.

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక.. తొలిరోజు రెండు నామినేషన్లు మాత్రమే..

నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు శుక్రవారమే నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పేర్కొంది. ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, 15న నామినేషన్ల పరిశీలిస్తామని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు ఉంటుందని వెల్లడించింది. ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ కావ‌డంతో శుక్రవారం నుంచే నామినేష‌న్ల దాఖ‌లు కూడా ప్రారంభ‌మైపోయింది. తొలి రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు ముగియ‌గా… రెండు నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. వీటిలో ప్రజా ఏక్తా పార్టీ నుంచి నాగరాజు దాఖ‌లు చేసిన నామినేష‌న్ ఒక‌టి కాగా… రెండో దానిని స్వతంత్ర అభ్యర్థిగా మారం వెంక‌ట్ రెడ్డి దాఖ‌లు చేశారు.

తన మీద నమ్మకంతో నాలుగో సారి కేసీఆర్ బీఫాం ఇచ్చారని మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి మునుగోడులో డిపాజిట్ రాదని.. మూడో స్థానంలో ఉంటుందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల గౌరవం పోగొట్టారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గ హద్దులు కోమటిరెడ్డికి తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. రాజగోపాల్ బీజేపీలో చేరడం వల్ల ఆ పార్టీ కలుషితం అయిందన్నారు. మునుగోడు అభివృద్ధి కోసం కాదు.. తన అభివృద్ధి కోసం రాజీనామా చేశారన్నారు. గెలిచే పార్టీ కాబట్టి టికెట్ ఆశించారన్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఎవరూ వ్యతిరేకించలేదని కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు.