NTV Telugu Site icon

CM KCR Grandson: సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డు.. అభినందించిన ముఖ్యమంత్రి

Himanshu

Himanshu

CM KCR Grandson: సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇంటర్నేషనల్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేసి పట్టా తీసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్​ డే వేడుకకు హిమాన్షు తాత, నాయనమ్మలైన సీఎం కేసీఆర్, శోభ దంపతులు.. తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని, 12వ త‌ర‌గ‌తి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న తమ మనుమడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అభినందించి, ఆశీర్వదించారు. కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్‌ విభాగంలో గొప్ప ప్రతిభను ప్రదర్శించినందుకు గాను హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డును అందించారు.

Read Also: Corona Cases: తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

గ్రాడ్యుయేషన్‌ పట్టాను అందుకున్న హిమాన్షు.. నేరుగా తాత వద్దకు వచ్చి ఆయన చేతుల్లో గ్రాడ్యుయేషన్‌ పట్టాను పెట్టి పాదాలకు నమస్కరించి తాత ఆశీర్వాదం తీసుకున్నారు. చిన్నతనం నుంచి తనచేతుల్లో పెరిగి నేడు పట్టభ‌ద్రుడిగా ఎదిగిన మనుమడిని ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయపూర్వకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనుమడిని ముఖ్యమంత్రి దంపతులు ఆశీర్వదించారు. మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు తమ కుమారుడు సాధించిన ప్రతిభానైపుణ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హిమాన్షు అమ్మమ్మ, మేనమామలు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.