NTV Telugu Site icon

CM Jagan : పంప్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తు తరాలకు గ్రీన్‌ ఎనర్జీ

Cm Jagan

Cm Jagan

నంద్యాల జిల్లాలో మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టులలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పంప్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తు తరాలకు గ్రీన్‌ ఎనర్జీ అందుతుందన్నారు. కాలుష్య కారక విద్యుత్‌పై ఆధారపడే పరిస్థితి క్రమేణా తగ్గుతుందని, భవిష్యత్తులో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు సీఎం జగన్‌. వీటికి అనుబంధంగా సోలార్‌, విండ్‌ ప్రాజెక్టులు అనుసంధానం అవుతున్న తీరు గ్రీన్‌ ఎనర్జీలో విప్లవానికి దారి తీస్తాయని, దేవుడు గొప్పవాడు, అందుకే మానవాళికి ఇంత చక్కటి వనరులు ఇచ్చాడన్నారు. పొద్దుట 6 నుంచి సాయంత్రం వరకూ సోలార్‌ వస్తుందని, విండ్‌ ఎనర్జీ సాయంత్రం నుంచి తెల్లవారు జాము వరకూ విండ్‌ ఎనర్జీని వాడుకోవచ్చని ఆయన వెల్లడించారు.

Also Read : బిడ్డకు తల్లిపాలు ఎప్పుడు.. ఎలా మాన్పించాలి..?

పీక్‌ అవర్స్‌లో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులను వినియోగించుకుంటామని, ఒక కృత్రిమ బ్యాటరీగా పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు పని చేస్తాయన్నారు సీఎం జగన్‌. కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పాదనలో ఏపీ మొదటి స్థానంలో నిలిచేలా ఈ అడుగులు వేస్తున్నామని, ఏపీలో 8999 మెగావాట్లకు సంబంధించి సోలార్‌, విండ్‌ పవర్‌ ఉందన్నారు. రైతులకు ఉచితంగా పగటి పూటే విద్యుత్తు అందుబాటులోకి రావాలని, 7200 మెగావాట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో రూ.2.49లకే ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. రైతులకు ఉచితంగా కరెంటును సమర్థవంతంగా కొనసాగించేందుకు, ఎలా ఢోకా లేకుండా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసిందని, తక్కువ ధరకే కరెంటు వస్తున్నందువల్ల ప్రభుత్వానికి, జెన్‌కోకు వెసులుబాటు కలుగుతుందని, ఇవన్నీ ఒకవైపున చేస్తుండగానే పంప్డ్‌ స్టోరేజీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.

Also Read : Riti Saha : విశాఖలో సంచలనం రేపుతున్న వెస్ట్ బెంగాల్ విద్యార్థిని అనుమానస్పద మృతి కేసు

29 ప్రాజెక్టులకు సంబంధించి 33వేల మెగావాట్లకు పైగా ప్రాజెక్టు నివేదికలు సిద్ధం అయ్యాయని, కొన్ని డీపీఆర్‌లు కూడా సిద్ధం అయ్యాయన్నారు. వివిధ కంపెనీలకు అలాట్‌మెంట్‌ కూడా చేశామని, ఇందులో భాగంగానే ఇవాళ ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం చేసుకుంటున్నామన్నారు. యాగంటిలో, కమలపాడులో దాదాపుగా 2వేల మెగావాట్లకు సంబంధించి రూ.10వేల కోట్లతో చెరిసగం వాటాతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంఓయూ కుదుర్చుకుంటున్నామని, ఈరెండు సంస్థలూ మరింతగా అడుగులు ముందుకేసేందుకు మరో 3700 మెగావాట్లకు సంబంధించిన ఫీజబిలిటీ స్టడీలు జరగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టులను కూడా చేపడతాయని, ప్రభుత్వ సంస్థల విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, ప్రయివేటు కంపెనీలను కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు సీఎం జగన్‌. గ్రీన్‌ ఎనర్జీ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తామన్నారు.

అంతేకాకుండా. ‘2300 మెగావాట్ల సౌరవిద్యుత్‌ గ్రీన్‌ కో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాం. 2300 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. ఆర్సెలర్‌ మిట్టల్‌ కూడా 1014 మెగావాట్ల సోలార్‌, విండ్‌ పవర్‌ పనులకు శంకుస్థాన చేస్తున్నాం. దాదాపు వేయి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎకోరన్‌ సంస్థ 2వేల మెగావాట్ల పునర్‌ ఉత్పాదక ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తున్నాం. మరో 2 వేలమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇవన్నీ రాబోయే రోజుల్లో స్థానికంగా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రతి మెగావాట్‌ ఉత్పత్తికి ఆ ప్రాజెక్టుల లైఫ్‌ ఉన్నంతకాలం రాయల్టీ కింద రూ.1లక్ష చొప్పున వస్తుంది. జీఎస్టీ ఆదాయంకూడా ప్రభుత్వానికి వస్తుంది. సహకారం అందిస్తున్న రైతులకు, రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటూ ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.30వేలు లీజు చొప్పున వస్తుంది. ప్రతి రెండేళ్లకు 5శాతం లీజు రుసుము పెరుగుతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకూ మంచి జరుగుతుంది. దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడే ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుల కారణంగా రైతులకు మంచి జరుగుతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల వస్తున్న ఉపాధి రూపంలోనే కాకుండా, జీఎస్టీ ఆదాయమే కాకుండా, రైతులకూ, ప్రభుత్వానికి భూముల ఇచ్చినందుకు లీజు రూపంలో డబ్బు వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా పర్యావరణానికి మేలు జరుగుతుంది.’ అని జగన్‌ తెలిపారు.

Show comments