విజయనగరం రైలు ప్రమాద ఘటన గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇవాళ ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుని.. అక్కడి నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతానికి హెలికాఫ్టర్‌లో చేరుకుంటారు. అటు నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరామర్శకు సీఎం వైయస్ జగన్ వెళ్తారు. విజయనగరం జిల్లాలో కంటాకపల్లి వద్ద ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నెమ్మదిగా వెళ్తున్న పలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి రాయఘడ ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సిగ్నల్ లేకపోవడంతో భీమాలి-అలమండ స్టేషన్ల మధ్యలో పలాస ప్యాసింజర్ అత్యంత నెమ్మదిగా వెళ్తోంది. ఆ సమయంలో ఈలోపు వెనుక నుంచి విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ వేగంగా వచ్చి ఢీకొంది. పలాస ప్యాసింజర్‌కు చెందిన గార్డ్ బోగీ ఎగిరి దూరంగా పడింది. దానికి ముందున్న రెండు బోగీలు పక్కకు ఒరిగి, అవతలి ట్రాక్‌పై బొగ్గు లోడ్‌తో ఉన్న గూడ్స్ రైలు ఇంజిన్‌ను ఢీకొని నుజ్జునుజ్జయ్యాయి. రాయఘడ ప్యాసింజర్ ఇంజిన్ పూర్తిగా ధ్వంసమైంది. దాని రెండు బోగీలూ పట్టాలు తప్పాయి. ఘటనలో 13 మంది మృతి చెందగా.. 50 మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read : Rohit-Kuldeep: రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్ర వాగ్వాదం.. వీడియో వైరల్!
ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. అలాగే సీఎం జగన్ సూచనతో మంత్రి బొత్స ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సాయం ప్రకటన కూడా చేశారు సీఎం వైయస్ జగన్. రైలుప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలవారు మరణిస్తే రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు ఘటన నుంచి సీఎం వైయస్ జగన్‌ను ఫోన్ చేసి ఆరా తీసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
