AP CM Jagan: ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులనుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు.
Read Also: Rail Accident: కోరమాండల్ రైలు ప్రమాదంలో 50దాటిన మృతుల సంఖ్య
ఒడిశాలో రైలుపట్టాలపై మరణ మృదంగం మోగింది. రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఓ గూడ్స్ రైలు ఢీకొనటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 233 మంది దుర్మరణం చెందారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని హావాకు వెళ్తున్న బెంగళూరు- హావ్రా సూపర్ఫస్ట్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. వాటిని షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. అనంతరం.. బోల్తాపడ్డ కోరమండల్ కోచ్లను పక్కనున్న ట్రాక్పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది.