Site icon NTV Telugu

CM Chandrababu: తెలుగుదేశం పార్టీ.. తెలుగింటి ఆడపడుచుల పార్టీ!

Cm Chandrababu

Cm Chandrababu

తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా.. మహిళలను దృష్టిలో పెట్టుకునే చేశామన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్ అని తెలిపారు. తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా పనిచేశారని మండిపడ్డారు. రిజర్వేషన్స్ అమలైతే 70-75 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారన్నారు. అమెరికా లాంటి దేశాలలో కూడా మహిళలకు సమానత్వం లేదని, సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. మహిళా సాధికారత అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడారు.

‘మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది. సంక్షేమం, అభివృద్ధి.. ఏదైనా మహిళలను దృష్టిలో పెట్టుకుని చేస్తాము. మహిళా సాధికారతపై మాటలు చెప్పడం వేరు.. చేతలు వేరు. మహిళలకు సమాన హక్కులు కల్పించడం అందరి బాధ్యత. ఇప్పటికీ మహిళలు వివక్షకు గురి అవుతున్నారు. మహిళలను చూస్తే ఇప్పటికీ చిన్నచూపు ఉంది. మహిళలు ప్రతి స్టేజ్లో ఎవరో ఒకరిపై ఆధారపడి ఉండే పరిస్థితి. మహిళా సాధికారత టీడీపీ నుంచి మొదలు అయింది. తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ. మహిళలను దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్. తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా పనిచేశారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

‘విద్యలో మహిళలను ప్రోత్సహించాలి. మహిళలకు ఇచ్చిన 33 శాతం రిజర్వేషన్‌తో సెలెక్ట్ అయిన అధికారిణి సూర్యకుమారి. ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్రపతి ముర్ము, కేంద్ర మంత్రి నిర్మల సీతరామన్ మహిళలకు ఆదర్శంగా ఉన్నారు. రిజర్వేషన్స్ అమలైతే 70-75 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారు. మగవారి కంటే ఆడవారు చాలా తెలివైన వారు. ఇప్పుడు మహిళలకే ఎదురుకట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. అమెరికా లాంటి దేశాలలో కూడా మహిళలకు సమానత్వం లేదు. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో బాలికలకు సైకిళ్లు ఇచ్చి ప్రోత్సహించాము. దీపం 2 కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఆర్టీసీలో పురుష కండక్టర్ల కంటే.. మహిళా కండక్టర్లే బాగా పనిచేస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Exit mobile version