విజన్ 2047ను సక్సెస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని, విజన్ డాక్యుమెంట్ అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. నియోజక వర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్లను సభ్యులకు అందిస్తాం అని, ప్రతి ఒక్కరిని విజన్ 2047లో భాగస్వామ్యులను చేయాలన్నారు. ప్రతీ ఏడాది 15 శాతం గ్రోత్ రేట్ ఉండాలని, వికసిత్ భారత్ -2047 కల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరాలన్నారు. ఆనాడు హైదరాబాద్‌ను విజన్ 2020 పేరుతో అభివృద్ధి చేశామని, ఇప్పుడు దేశంలోనే తలసరి ఆదాయంలో హైదరాబాద్ నంబర్ వన్ అయిందని సీఎం చెప్పారు. విజన్-2047 డాక్యుమెంట్‌పై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది.
‘విజన్ 2047పై గత ప్రభుత్వంలో ధ్వసమైన రాష్ట్రాన్ని మరలా గాడిలో పెట్టగలిగాము. గతంలో నేను విజన్ 2020 తీసుకు వచ్చా. ప్రస్తుతం విజన్ 2047 ప్రధాని మోడీ అమలు చేస్తున్నారు. ఏపీలో కూడా అభివృద్ధి సాధించేందుకు స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు వేస్తున్నాం. ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తూ నియోజకవర్గాల వారీగా కూడా విజన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ప్రతి ఏడాది 15 శాతం గ్రోత్ రేట్ ఉండాలి. సమర్ధవంతంగా ప్లానింగ్ ఉంటే సాధిస్తాం. 2047 నాటికి ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా మారటమే లక్ష్యం. అలాగే రూ.308 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించేలా ప్రణాళికలు చేశాం. ప్రతీ ఏటా రూ.15 శాతం వృద్ధి రేటుతో రూ.55 లక్షల తలసరి ఆదాయం సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 17.11 శాతం మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకున్నాం. మొత్తంగా జీఎస్డీపీ 18,65,704 కోట్ల మేర, తలసరి ఆదాయం 3.47 లక్షల లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.