గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కలిసి 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించనున్న ఇళ్లకు శంకుస్థాపన చేశారు. బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో రూ.14 కోట్ల అంచనా వ్యయంతో 117 3డీ కాంక్రీట్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (PMAY-G) కింద దేశంలోనే తొలిసారిగా గ్రామీణ గృహ నిర్మాణంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. ఈ ప్రాజెక్టులో కేంద్రం రూ.9.44 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4.49 కోట్లను సమకూర్చనుంది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రస్తుతం మంజూరైన మూడు లక్షల ఇళ్లు సరిపోవని, మరో ఆరు లక్షల ఇళ్లు కావాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మరో మూడు లక్షలు, ఆ తర్వాత మరో మూడు లక్షల ఇళ్లు ఇస్తామని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారని చెప్పారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మూడు లక్షల ఇళ్ల నిర్మాణం మూడు లక్షల కుటుంబాల భవిష్యత్తును మార్చబోతుందన్నారు. పేదలకు సొంతిల్లు ఉండాలనే ఆలోచనను తొలిసారిగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. 2029 నాటికి రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ వంద శాతం సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
బుర్రిపాలెంతో తనకున్న అనుబంధాన్ని కూడా సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. బుర్రిపాలెంలో ఒక హీరో ఉన్నారని, ఆయనే సూపర్‌స్టార్ కృష్ణ అని అన్నారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో కృష్ణ నటించిన ‘తేనె మనసులు’ సినిమా చూశానని గుర్తుచేసుకున్నారు. అదే బుర్రిపాలెంలో మరో హీరో ఉన్నారని, ఆయనే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అని వ్యాఖ్యానించారు. సూపర్‌స్టార్ కృష్ణ సినిమా హీరో అయితే.. పెమ్మసాని చంద్రశేఖర్ పొలిటికల్ హీరో అని చంద్రబాబు పేర్కొన్నారు. కూటమికి ఎదురులేదని, తిరుగులేదన్నారు. ఇటీవల ఎన్నికల్లో కూటమికి ప్రజలు భారీ మద్దతు ఇచ్చారన్నారు. విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో రూ.52 వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను పేదల సొంతం చేశామని సీఎం తెలిపారు.
3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించే ఇళ్ల ప్రత్యేకతలను కూడా సీఎం చంద్రబాబు వివరించారు. ఈ సాంకేతికతతో నిర్మించిన ఇళ్లలో బయట, లోపల ఉష్ణోగ్రత మధ్య సుమారు 8 డిగ్రీల వరకు తేడా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని వేగంగా, నాణ్యమైన గృహాలను నిర్మించేందుకు ఈ పైలట్ ప్రాజెక్టు దోహదపడుతుందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో విధ్వంసం జరిగిందని విమర్శించారు. భూముల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. నివాసానికి అనువుకాని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. మార్చి నాటికి ఎలాంటి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టుపైనా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అమరావతి అభివృద్ధిపై కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి అభివృద్ధితో మంగళగిరి, విజయవాడ, తెనాలి, గుంటూరు ప్రాంతాలన్నీ కలసి భారీ మెగా సిటీగా రూపుదిద్దుకోనున్నాయని అన్నారు. వచ్చే ఫిబ్రవరి 3న అమరావతిలో క్వాంటం వ్యాలీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో అమరావతిని ముందంజలో నిలిపేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

