Cyclone Arnab Impact: తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. రాత్రంతా అధికారులకు దిశానిర్దేశం!

Cyclone Arnab Cm Chandrababu

Cyclone Arnab Cm Chandrababu

CM Chandrababu Reviews Cyclone Arnab Impact: అర్నబ్ తుఫాన్‌ ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులు, క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులతో సీఎం సమీక్ష చేశారు. రాత్రంతా అర్నబ్ తుఫాన్ ప్రభావం… తీసుకోవాల్సిన జాగ్రత్తలు… క్షేత్ర స్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. రాత్రి 1:30 గంటల వరకు సీఎం పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూనే అధికారులకు దిశానిర్దేశం చేసారు.

ఇవాళ ఉదయం 6:15 గంటలకు మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి, జరుగుతున్న తుఫాన్ సహయక చర్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. తుఫాన్ తీరం దాటుతోందని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు ఆర్టీజీఎస్ అధికారులు. తుఫాన్ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయని, కొన్ని చోట్ల విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయని సీఎం దృష్టికి తీసుకెళ్ళారు అధికారులు.

అతి తీవ్ర తుఫాన్‌ ‘అర్నబ్‌’ కోస్తాంధ్రను వణికించింది. మంగళవారం వీచిన ప్రచండ గాలులకు చాలా చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల హోర్డింగులపై ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. అత్యంత భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో అతి భారీవర్షం కురిసింది. తుఫాన్‌ పరిస్థితిపై సీఎం చంద్రబాబు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.