Site icon NTV Telugu

Murali Naik: మురళీ నాయక్‌ కుటుంబసభ్యులను ఫోన్‌లో పరామర్శించిన సీఎం.. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కు!

Army Jawan Murali Naik

Army Jawan Murali Naik

శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఆర్మీ జవాను మురళీ నాయక్‌ జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందారు. శుక్రవారం తెల్లవారుజామున చొరబాటు దారుల కాల్పుల్లో ఆయన మరణించారు. కాల్పుల్లో మురళీ నాయక్‌ మృతి చెందినట్లు గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ కల్లి తండాలో ఉంటున్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలిసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మురళీ నాయక్‌ 2022లో అగ్నివీర్‌ జవానుగా సైన్యంలో చేరారు. రెండు రోజుల క్రితం వరకు నాసిక్‌లో విధులు నిర్వర్తించైనా ఆయన.. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు వచ్చారు.

Also Read: Gill-Rohit: ప్రతి ఒక్కరికీ నువ్వు స్ఫూర్తి.. ఆ విషయాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా!

మురళీ నాయక్‌ తల్లిదండ్రులను సీఎం చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. దేశ రక్షణలో సైనికుడు మురళీ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని సీఎం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీకి నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మురళీ నాయక్‌ కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక మంత్రి సవిత కల్లి తండాకు వెళ్లి జవాను తల్లిదండ్రులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును మురళీ నాయక్‌ తల్లిదండ్రులకు అందజేశారు.

Exit mobile version