ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య సమావేశం ముగిసింది. సీఎం నివాసానికి కాన్వాయ్‌తో వచ్చిన పవన్.. ఆయనతో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా పరిషత్ స్థానాల సర్దుబాటు వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించిన సీట్ల సర్దుబాటు ఫార్ములా తరహాలోనే జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేన మధ్య స్థానాల కేటాయింపు ఉండే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ 7 లేదా 8 జిల్లా పరిషత్ స్థానాలను కోరుతున్నట్లు సమాచారం.
చిత్తూరు, తిరుపతి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని స్థానాలను జనసేన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాల్లో పార్టీకి అనుకూలంగా ఉన్న స్థానాలను గుర్తించి సీట్ల సర్దుబాటు చేసుకునే అంశంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తకుండా, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవడం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కూటమి ఐక్యతను కొనసాగిస్తూ, పరస్పర సహకారంతో ముందుకు వెళ్లేలా సంకేతాలు ఇచ్చే అంశంపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.

