AP CM Chandrababu: తిరుమలకు జగన్ వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమల వెళ్లకుండా ఉండడానికి జగన్‌కు ఏ సాకులు ఉన్నాయో తెలియదన్నారు. జగన్ తిరుమలకు వెళ్లొద్దని ఎవరైనా చెప్పారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. దేవుడి ఆచారాలు, సాంప్రదాయాలను ఎవరైనా గౌరవించి తీరాల్సిందేనన్నారు. దేవుడు, ఆచారాల కంటే ఏ వ్యక్తి గొప్పకాదన్నారు. ఆలయ సాంప్రదాయాలను అందరూ గౌరవించాలన్నారు. తిరుమల లాంటి పుణ్యక్షేత్రం మనకు ఉండడం తెలుగువారి అదృష్టమన్నారు. ఇంతకు ముందు వెళ్లానని.. ఇప్పుడెందుకు వెళ్లకూడదని జగన్ అంటున్నారన్న చంద్రబాబు.. అప్పుడు నిబంధనలు ధిక్కరించి తిరుమల వెళ్లారన్నారు. గతంలో చాలా మంది డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వెళ్లారన్నారు. అన్ని మతాలను గౌరవిస్తానన్న జగన్ తిరుమలలో ఎందుకు నిబంధనలు పాటించరని ప్రశ్నించారు. నాలుగు గోడల మధ్యే కాదు బయట కూడా బైబిల్ చదువుకోవచ్చన్నారు.
Read Also: Andhra Pradesh: జిల్లాల్లో సీఎం పర్యటనల కోసం రెండు అడ్వాన్స్ టీమ్‌లు ఏర్పాటు
తాను కూడా మసీదుకు వెళ్తానని.. చర్చికి వెళ్తానని, వాళ్ల మతాచారాలను గౌరవిస్తానన్నారు. ఫ్యాబ్లో ఎస్కోబార్‌ను జగన్‌తో పోల్చుకుంటే ఇద్దరూ ఒకేలా ఉంటారని విమర్శించారు. నెయ్యి కల్తీనే జరగలేదని అంటాడని.. ఈవో చెప్పారని అంటాడని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏఆర్ డెయిరీ నుంచి 8 ట్యాంకర్లు నెయ్యి వచ్చిందని.. నాలుగు ట్యాంకర్లు వాడారన్నారు. ఎన్డీడీబీ రిపోర్టునే తప్పు పడుతున్నారన్నారు. రిపోర్ట్ బయటపెట్టకుంటే దాచిపెట్టినట్లు కాదా అని ఆయన వ్యాఖ్యానించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే అధికారం మీకెవరిచ్చారని ప్రశ్నించారు. చెప్పిన అబద్ధాన్నే జగన్ మళ్లీ మళ్లీ చెబుతున్నారని సీఎం విమర్శించారు. వైసీపీ హయాంలో తిరుమలలో నాసిరకం భోజనాలు పెట్టారన్నారు. అన్ని ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. రామతీర్థంలో రాముడి విగ్రహంపై దాడి చేస్తే చర్యలు లేవన్నారు. డిక్లరేషన్‌పై సంతకం పెట్టడం ఇష్టం లేకే తిరుమలకు వెళ్లడం లేదన్నారు. దళితులను రానివ్వడం లేదని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. జగన్‌కు విశ్వసనీయత లేదన్నారు.