CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!

Cm Chandrabau

Cm Chandrabau

CM Chandrababu: వైసీపీ చేపడుతున్న రిలే దీక్షలు, నిరసనలపై సీఎం చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. చట్ట వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నిరసనలు చేపడితే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. బస్టాండ్లు, రహదారుల వెంట నిరసనలు చేపడితే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ.. చట్టానికి వ్యతిరేకంగా, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఆందోళనలు చేయడాన్ని ప్రభుత్వం అనుమతించదని ఆయన అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ దీక్షల్లో రౌడీలు, గంజాయి బ్యాచ్‌ తప్ప ఒక్క డీఎస్సీ అభ్యర్థి అయినా ఉన్నారా..? అని ప్రశ్నించారు. డీఎస్సీ అభ్యర్థుల పేరుతో రాజకీయ నిరసనలు చేపడుతున్నారని ఆయన విమర్శించారు. కర్నూలులో తాజాగా నిరసన చేపట్టిన వారంతా డీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన టీచర్లేనని చంద్రబాబు పేర్కొన్నారు. టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారు నిరసనల్లో పాల్గొన్నారని చెప్పారు.

గత పాలక పార్టీ చేసిన నష్టం కారణంగానే టీచర్లు ఐక్యంగా తమ ఆత్మగౌరవాన్ని చాటుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన పరిణామాల వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు వారు ఐక్యంగా స్పందిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే నిరసనలు, రహదారులు, బస్టాండ్లను అడ్డుకునే ఆందోళనలను ప్రభుత్వం అంగీకరించబోదని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.