CM Chandrababu Happy About AP Local Body Elections Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు అఖండ విజయాన్ని అందించారని సీఎం చంద్రబాబు అన్నారు. 2024 ఎన్నికలతో పోలిస్తే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. ప్రజల నుంచి లభించిన ఆదరణకు ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఈ విజయంతో రాష్ట్ర ప్రజలు తన ఆలోచనలకు అనుగుణంగా తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంతాల్లో కూటమికి 59 శాతం ఓట్లు వచ్చాయని, 94 శాతం స్ట్రైక్ రేట్ నమోదైందని వెల్లడించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కూటమికి మంచి ఫలితాలు వచ్చాయని సీఎం చెప్పారు.
‘పోస్టల్ బ్యాలెట్‌లోనూ కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూటమికి 60 శాతం ఓట్లు వచ్చాయి. పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీతో పోలిస్తే కూటమికి 30 శాతానికి పైగా ఆధిక్యం దక్కింది. ఉద్యోగుల ఓట్లు కూడా కూటమికి గణనీయంగా వచ్చాయి. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 55.3 శాతం ఓట్లు రాగా.. వైసీపీకి 39.81 శాతం ఓట్లు వచ్చాయి. స్థానిక ఎన్నికల్లో కూటమికి 58.9 శాతం, వైసీపీకి 33.56 శాతం ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 25.34 శాతం పాయింట్లు. 2024తో పోలిస్తే కూటమి ఆధిక్యం కూడా పెరిగింది’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
‘నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మంచి రాజకీయాల ద్వారా సుపరిపాలన అందించాలనే నమ్మకంతో ముందుకు సాగుతున్నా. నా నమ్మకాన్ని ప్రజలు మరోసారి నిజం చేశారు. 2024లోనూ, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ కూటమికి మెరుగైన ఆదరణ అందించారు. అభివృద్ధికి ఆమోదం, సుపరిపాలనకు గౌరవంగా ఈ ఎన్నికల ఫలితాలను భావిస్తున్నా. రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో సహాయక చర్యలను కొనసాగించాము. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు కూడా కూటమికి వచ్చిన మద్దతును ప్రతిబింబిస్తున్నాయి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
‘ఎన్నికల్లో డబ్బు పంపిణీ, అనవసర ఖర్చులకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. డబ్బు ఖర్చు చేయడానికి బదులుగా నాయకులు సేవాభావంతో ప్రజల ముందుకు రావాలి. ఎన్నికల ఖర్చు తగ్గడం శుభపరిణామం. ఖర్చులు తగ్గితే నాయకుల్లో సేవాభావం పెరుగుతుంది. ఎన్నికల్లో పెట్టిన డబ్బును తిరిగి సంపాదించుకోవాలనే ఆలోచనకు రాజకీయ నాయకులు దూరంగా ఉండాలి. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేసే నాయకత్వం పెరగాలి. రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక అసమానతలు తగ్గి ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించాలి. ప్రజలకు సేవ చేయడమే రాజకీయాల ప్రధాన లక్ష్యంగా ఉండాలి’ అని సీఎం చెప్పుకొచ్చారు.

