NTV Telugu Site icon

CM Chandrababu: పెట్టుబడులే లక్ష్యంగా.. దావోస్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు!

Cm Chandrababu

Cm Chandrababu

సీఎం చంద్రబాబు నాయుడు నేడు దావోస్‌ పర్యటనకు వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ చేరుకుని.. అర్ధరాత్రి తన బృందంతో కలిసి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు బయల్దేరతారు. బ్రాండ్ ఏపీ పేరుతో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా, దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సుకు సీఎం వెళ్తున్నారు. ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు హాజరయ్యే ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం ప్రయత్నం చేయనున్నారు.

మొదటిరోజు జ్యూరిచ్‌లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. అనంతరం హోటల్‌ హయత్‌లో ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌ విత్‌ తెలుగు డయాస్పొరా’ పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సీఎం చర్చిస్తారు. అనంతరం దావోస్‌లో పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పాల్గొంటారు. ఆర్సెలార్‌ మిత్తల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ లక్ష్మీ మిత్తల్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారు.

రెండో రోజు సీఐఐ సెషన్‌లో గ్రీన్‌ హైడ్రోజన్‌ అంశంపై చర్చ, సోలార్‌ ఇంపల్స్, వెల్‌స్పన్, కోకకోలా, ఎల్‌జీ, కార్ల్స్‌బర్గ్, వాల్‌మార్ట్‌ ఇంటర్నేషనల్, సిస్కో, కాగ్నిజెంట్‌ తదితర సంస్థల ఛైర్మన్లు సహా సీఈఓలతో జరిగే సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఈ సమావేశానికి యూఏఈ ఎకానమీ మంత్రి అబ్దుల్లా బిన్‌ కూడా హాజరవుతారు. అనంతరం ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌ చర్చల్లో సీఎం పాల్గొంటారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చాగోష్ఠులు, బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చే ఇంటర్వ్యూలో రాష్ట్ర విధానాలను ఆయన వివరిస్తారు. మూడో రోజు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రోజుకు కనీసం పదికి భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. నాలుగో రోజు ఉదయం సీఎం స్వదేశానికి బయల్దేరతారు.