Site icon NTV Telugu

CM Chandrababu: ఆర్ అండ్ బీ శాఖపై సీఎం సమీక్ష.. రోడ్ల దుస్థితి చర్చ.. కీలక ఆదేశాలు

Cbn

Cbn

CM Chandrababu: ఓవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు.. మరోవైపు.. వివిధ శాఖలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, ఈ రోజు ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష చేశారు.. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం.. రోడ్ల దుస్థితిపై ఈ సమావేశంలో చర్చించారు.. రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని సీఎం చంద్రబాబుకు చెప్పారు అధికారులు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదన్నారు.. గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడెవరూ ముందుకు రావడం లేదని సీఎంకు వివరించారు అధికారులు. గుంతలు పూడ్చేందుకు తక్షణం రూ.300 కోట్లు అవసరం అని సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఆర్ అండ్ బీ అధికారులు..

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

అయితే, అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదు అని మండిపడ్డ ఆయన.. వాహనదారులు, ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారు. ఈ పరిస్థితిని మార్చేలా పనులు మొదలు కావాలని స్పష్టం చేశారు.. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ మొదలు పెట్టాలి.. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉంది. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్లు మేర ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాలని ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

Exit mobile version