Site icon NTV Telugu

CM Chandrababu: గతంలో పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి ఉండేది.. సీఎం ఘాటు వ్యాఖ్యలు..!

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తీసుకురావడం తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనేక సమస్యలతో సతమతమైన రాష్ట్ర వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు సమన్వయంతో ముందుకు సాగుతున్నామని.. పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా సంక్షేమం ముఖ్య లక్ష్యాలతో ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందిన వెంటనే 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించి అమలు చేశామన్నారు.

Kishan Reddy: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేందుకు అందరూ కృషి చేయాలి..!

రాష్ట్రాన్ని ఆర్ధికంగా గాడిలో పెట్టేందుకు తాము ఇచ్చిన హామీల ప్రకారం ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి త్రైమాసికం రాష్ట్ర స్థూల ఉత్పత్తి పురోగతిని సమగ్రంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు, అనవసర అప్పులు, ఆస్తుల తాకట్టు కారణంగా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, వాటిని పునర్నిర్మించడం కోసం కృషి చేస్తున్నామన్నారు. పీక్ లోడ్ సమయంలో యూనిట్‌కు 15 రూపాయల ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని గత పాలకులు సృష్టించారని, పీపీఎలు రద్దు చేసిన కారణంగా వాడకపోయినా 9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందని ఆయన విమర్శించారు. విద్యుత్ చార్జీలు పెంచకుండా, వ్యవస్థలను స్థిరంగా ఉంచేందుకు సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను క్రమంగా పునరుద్ధరించగలిగామని, పెట్టుబడిదారుల నమ్మకం తిరిగి వచ్చిందని సీఎం చెప్పారు. భాగస్వామ్య సదస్సులో 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, SIPB ద్వారానే 8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. గతంలో పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి ఉండగా.. ఇప్పుడు తిరిగి పెట్టుబడి వాతావరణం ఏర్పడుతోందని అన్నారు. విద్యా రంగాన్ని గత పాలకులు అస్తవ్యస్తం చేశారని, ఇంగ్లీష్ మీడియం పేరుతో పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారని సీఎం విమర్శించారు. పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తూ, విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు చేపట్టామని చెప్పారు.

Kishan Reddy: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేందుకు అందరూ కృషి చేయాలి..!

పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. గత ప్రభుత్వం వారసత్వంగా వదిలి వెళ్లిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించడం పెద్ద సవాలైందన్నారు. జనవరి 1 నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త కనపడకుండా చేయడం లక్ష్యమని చెప్పారు. సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నామని, వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రజల చేతుల్లోకే పాలనను తీసుకువెళ్తున్నామని సీఎం అన్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాజెక్టులకు భారీగా మూలధన వ్యయం పెంచి పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు. అలాగే “చేయలేమని పారిపోయే ప్రభుత్వము మేము కాదు. రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే బాధ్యతను స్వీకరించాం” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు సాగుతుందని సీఎం అన్నారు.

Exit mobile version