NTV Telugu Site icon

CM Chandrababu: రాజధాని పునర్నిర్మాణంపై సీఎం ఫోకస్‌.. నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో భేటీ

Cbn

Cbn

CM Chandrababu: రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. గతంలో అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, నిర్మాణ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.. గతంలో ఉన్న టెండర్ల కాలపరిమితి ముగియడంతో ఆయా కంపెనీలతో మళ్లీ చర్చలు జరుపుతోంది కూటమి ప్రభుత్వం.. మధ్యలో నిలిచిపోయిన పనులు కొనసాగించే అంశంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ సాగుతోంది..

Read Also: CM Revanth Reddy: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కాగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటనలపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు.. మొదట పోలవరం.. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో పర్యటించారు.. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని పేర్కొన్నారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారని, రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్‌డీఏ కార్యాలయం సీఎం చంద్రబాబు మాట్లాడారు.. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించిందన్నారు. ఏపీ అనగా ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అంటూ చంద్రబాబు అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలు పెట్టామని, అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందన్నారు. పోలవరం వల్ల రైతులకు మేలు జరిగేదని, ఈ రెండింటిని వైసీపీ సర్వ నాశనం చేసిందని విమర్శించారు. విభజిత ఏపీ, ఉమ్మడి ఏపీలో ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదన్నారు. ఇక, అమరావతి ప్రజా రాజధాని, విశాఖ ఆర్థిక రాజధాని అంటూ సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలును మోడల్ సిటీగా మారుస్తామన్నారు. రాయలసీమ సహా ఏపీలో 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పామని, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు గతంలోనే రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన విషయం విదితమే.