CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పంలో పారిశ్రామిక అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. గుడుపల్లె మండలం పొగురుపల్లెలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. 30.75 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పరిశ్రమ ఈ నెల నుంచే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుంది.

పరిశ్రమను సందర్శించిన సీఎం చంద్రబాబు వివిధ విభాగాలను ప్రారంభించి యూనిట్ పనితీరుపై కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 1,400 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించనుండగా.. ప్రారంభ దశలోనే 300 నుంచి 400 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు సంస్థ వెల్లడించింది. ఈ పరిశ్రమ వల్ల స్థానిక కోళ్ల పెంపకందారులకు కూడా గణనీయమైన ప్రయోజనం చేకూరనుంది.

అనంతరం కుప్పంలో APIIC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును సీఎం ప్రారంభించారు. గుడుపల్లె మండలం పొగురుపల్లెలో 44.58 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పార్కులో 167 పారిశ్రామిక ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల నుంచే పారిశ్రామికవేత్తలకు ప్లాట్ల కేటాయింపులు ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఈ పార్క్ కీలక పాత్ర పోషించనుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పంలో రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని ప్రకటించారు. ఈ పెట్టుబడులు వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కుప్పం ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలే తనకు బలమని పేర్కొన్న సీఎం.. ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు కొత్త కుప్పాన్ని చూస్తున్నానని అన్నారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. ప్రపంచ స్థాయి పరిశ్రమలను రాష్ట్రానికి, ముఖ్యంగా కుప్పానికి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

యువత ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా వ్యాపారాలపై కూడా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. కాలేజీ స్థాయి నుంచే పారిశ్రామిక ఆలోచనలు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని, అందులో కుప్పం ముందుండాలని ఆకాంక్షించారు. అడిడాస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌వేర్ సంస్థతో పాటు టూ-సీటర్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ సంస్థలను కూడా కుప్పానికి తీసుకువచ్చామని చంద్రబాబు వెల్లడించారు. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న కుప్పం, ఇప్పుడు అభివృద్ధి కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు.

కుప్పం అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం చెప్పారు. గ్రీన్ కవర్ పెంపు, పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త నుంచి బయోఫ్యూయల్ తయారీ, నెట్ జీరో విధానాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా పనిచేస్తోందన్నారు. కుప్పం బ్లూ గ్రానైట్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, అందుకే హెరిటేజ్ గ్రానైట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కుప్పంలో నీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. హంద్రీ-నీవా ద్వారా ఇప్పటికే నీరు అందించామని, భవిష్యత్తులో గండికోట నుంచి కూడా సాగునీరు తీసుకొస్తామని చెప్పారు. ఇంటింటికీ తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కుప్పం అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేసిన చంద్రబాబు.. అభివృద్ధిని కోరుకునే వారే కుప్పంలో ఉండాలని, యువత తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కుప్పం పొగురుపల్లిలో రాష్ట్రంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.