CM Chandrababu: ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్యనాయుడుకి శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయ 19వ గేటు కొట్టుకపోయింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడకు వెళ్లాలని కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ, కర్నాటక అధికారుల సహకారంతో స్టాప్ లాగ్ గేటు విజయవంతంగా అమర్చారు. దీంతో సుమారు 30 టీఎంసీల నీరు వృధా కాకుండా అడ్డుకోగలిగారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కన్నయ్య నాయుడిని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. ప్రాజెక్టులో నీరు ఉండగానే స్టాప్ లాక్ గేటు అమర్చి నీరు వృధా కాకుండా రైతాంగానికి ఎంతో మేలు చేశారని ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రైతాంగం తరపున కన్నయ్య నాయుడుకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: Botsa Satyanarayana: ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. తుంగభద్ర ప్రాజెక్టులో 19 గేటు కొట్టుకుపోయిన ప్రమాదంలో రికార్డు టైమ్‌లో స్టాప్ లాగ్ గేట్ అమర్చారని తెలిపారు. గేటు కొట్టుకు పోయి నీరు వృధాగా కొట్టుకు పోతున్న దశలో సీఎం చంద్రబాబు స్పందించారన్నారు. డ్యాం భద్రత, గేట్ల అమరికపై నైపుణ్యం ఉన్న కన్నయ్య నాయుడును హుటాహుటిన సీఎం పిలిపించారని చెప్పారు. తుంగభద్ర అధికారులు అంతా చేతులు ఎత్తేశారని వెల్లడించారు. ఆ సమయంలో కన్నయ్య నాయుడు తన బృందంతో రికార్డు సమయంలో స్టాప్ లాగ్ గేట్ అమర్చారంటూ కొనియాడారు. గేట్ అమర్చే విషయంలో కేంద్ర జల సంఘం కూడా అనుమానాల్ని వ్యక్తం చేసిందన్నారు. అయినా ధైర్యంతో కన్నయ్య నాయుడు బృందం గేట్ అమర్చి 40 టీఎంసీల నీటిని వృధాగా పోకుండా కాపాడిందని ప్రశంసించారు. స్టాప్ లాగ్ గేట్ రెండు మూడు భాగాలుగా చేసి అమర్చగలిగారని.. కర్ణాటక, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని వరద ప్రవాహం ఉన్నా గేటు అమర్చారని తెలిపారు. ఆయన చేసిన సేవల్ని గుర్తిస్తూ రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వం, సీఎం చంద్రబాబు సత్కరించారని వెల్లడించారు.
ఎప్పుడో కట్టిన తుంగభద్రా డ్యాంపై స్టాప్ లాగ్ గేటు అమర్చడం ఒక సవాలు అని ఇరిగేషన్ ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు అన్నారు. అయినప్పటికీ 5 రోజుల్లోనే డిజైన్ చేయడం, ఫాబ్రికేట్ చేసి అమర్చడం మేం సాధించిన విజయమని తెలిపారు. గడిచిన ఐదేళ్ళలో ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టలేదని.. గ్రీజు పెట్టలేదు, గేట్లకు రంగు వెయ్యలేదు.. అందుకే పులిచింతల, గుండ్లకమ్మ లాంటి ప్రాజెక్టులు గేట్లు కొట్టుకు పోయాయన్నారు.పులిచింతల ప్రాజెక్టు గేట్ల గురించి ముందే హెచ్చరించామన్నారు. లీకేజీ గురించి తెలిసి దృశ్యాలు కూడా పంపించామన్నారు. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. అందుకే గేటు కొట్టుకు పోయిందంటూ కన్నయ్యనాయుడు అన్నారు. ప్రాజెక్టుల్లోని గేట్ల జీవిత కాలం 45 ఏళ్లు అని.. వాటి నిర్వహణ కూడా సక్రమంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
