CID investigation on Liquor Scam: గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు గుప్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. లిక్కర్ స్కామ్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నారు.. వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈడీకి రిఫర్ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఈడీ దర్యాప్తుకు అర్హమైన కేసుగా పేర్కొన్న ఆయన.. మద్యం విషయంలో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లల్లో లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయి.. ఇది భయంకరమైన స్కామ్‌గా అభివర్ణించారు..
Read Also: Rahul Gandhi: పార్లమెంట్‌లో రాహుల్ గాంధీని కలిసిన రైతు సంఘాల నేతలు..
ఇక, మద్యం కుంభకోణాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. నేరస్తుడే సీఎం అయితే వ్యవస్థలు ఎలా ఉంటాయో గత ఐదేళ్లల్లో చూశామన్న ఆయన.. మద్య నిషేధం అని హామీ ఇచ్చారు.. ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టారు. మద్యం పాలసీలో అడుగడుగునా తప్పులు చేశారు. వైసీపీ హయాంలోని మద్యం పాలసీ వల్ల నేరాలు పెరిగాయని విమర్శించారు. గత ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది. మైండ్ ఉండే ఎవ్వడూ ఈ తరహాలో ఎక్సైజ్ పాలసీ రూపొందించరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏం చేసినా జరిగిపోతోందనే అహకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. పాత బ్రాండ్లను తప్పించారు.. కొత్త బ్రాండ్లను తెచ్చారు. పేదలు తాగే తక్కువ ధర మద్యం బ్రాండ్లు లేకుండా చేశారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. MNC బ్రాండ్లకు చెల్లింపులు పెండింగులో పెట్టి.. వేరే బ్రాండ్లను మార్కెట్టులోకి తెచ్చారు. మద్యం దుకాణాల్లో మొత్తం నగదు లావాదేవీలే ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు.. మద్యం అమ్మకాల ఇల్లీగల్ కలెక్షన్ ద్వారానే మొత్తంగా రూ. 3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని దుయ్యబట్టారు.. లక్ష కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగితే.. కేవలం రూ. 630 కోట్లు మాత్రమే డిజిటల్ అమ్మకాలు జరిగాయన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.