Abhijeet Dipke: “ఇది అంతం కాదు.. ఆరంభం”.. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..

Abhijeet Dipke

Abhijeet Dipke

Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు, ఉద్యమ నాయకుడు 29 ఏళ్ల అభిజీత్ దిప్కే చారిత్రాత్మక విజయం సాధించాడు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు ప్రభుత్వం మిగతా డిమాండ్లకు కూడా అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలతో దిప్కేకు ఎట్టకేలకు విశ్రాంతి లభించింది. ఈ రోజు ఉదయం సోసల్ మీడియాలో అభిజీత్ దీప్కే ఓ వీడియో విడుదల చేశాడు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా దూరం ప్రయాణించాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారాయి.

రేపు ఉదయానికల్లా ఏం జరుగుతుందో, తదుపరి ఏం చేయాలో అనే ఆందోళనలు ఏమీ లేకుండా నా ఇంట్లోనే ప్రశాంతంగా నిద్రలేచే అవకాశం దక్కిందంటూ దిప్కే వీడియోలో పేర్కొన్నారు. గడిచిన 37 రోజుల సుదీర్ఘ నిరసన కాలం చాలా చాలా కష్టంగా సాగిందని పేర్కొంటూ, తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని తన సోషల్ మీడియా ఫాలోవర్లకు గుర్తుచేశారు.

తాజాగా సిద్ధించిన విజయం అంత సులువుగా ఏమీ రాలేదని దిప్కే గుర్తుచేసుకున్నారు. అనేక అనుమానాలు, విమర్శలు ఉన్నప్పటికీ CJPకి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నందున నిన్న జంతర్ మంతర్ వద్ద అందరినీ కలిసి వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పలేకపోయానని క్షమాపణలు కోరారు. “37 రోజులుగా జంతర్ మంతర్ వద్ద వేచి ఉన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీరు దేశం కోసం చేసిన దాన్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా తమను విమర్శించిన వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, వారి చట్టబద్ధమైన ప్రశ్నలే తమ లోపాలను దిద్దుకుని ముందుకు సాగడానికి, విజయం సాధించడానికి తోడ్పడ్డాయని స్పష్టం చేశారు.