Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..

Osama Bin Laden

Osama Bin Laden

Osama Bin Laden: అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న జరిగిన భయానక ఉగ్ర దాడులకు కొన్ని సంవత్సరాల ముందే, అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ భారతదేశంలో కూడా దాడులు చేయడానికి ప్రణాళికలు రచించినట్లు వెల్లడైంది. 1998 నాటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) వర్గీకరించని (Unclassified) నివేదిక ద్వారా ఈ సంచలన విషయం బయటపడింది. 9/11 దాడుల 25వ వార్షికోత్సవం సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్‌లకు సమర్పించిన 100 కంటే ఎక్కువ పేజీల రహస్య నివేదికలను సీఐఏ బయటపెట్టింది. ఆగస్టు 28, 1998 నాటి ప్రెసిడెన్షియల్ డైలీ బ్రీఫ్‌కు ‘బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్‌వర్క్ స్టిల్ ఎ థ్రెట్’ అని పేరు పెట్టారు. అందులో లాడెన్ దాడులు చేయాలని భావించిన దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. ఈ నివేదిక ప్రకారం.. ఈజిప్ట్, అరేబియా ద్వీపకల్పం (ముఖ్యంగా కువైట్, సౌదీ అరేబియా, యెమెన్), భారత్, పాకిస్థాన్, ఉగాండా, నైజీరియాలలో దాడులకు లాడెన్ ప్లాన్ చేశాడు. అయితే, ఈ పత్రంలో భారతదేశంలోని టార్గెట్ ప్లేస్, దాడికి కరెక్ట్ తేదీ లేదా ఆపరేషనల్ ప్లాన్ వివరాలు మాత్రం పేర్కొనలేదు. అలాగే ఈ సమాచారానికి ఆధారమైన ఇంటెలిజెన్స్ సోర్స్‌ను కూడా గోప్యంగా ఉంచారు.

సుమారు 60కి పైగా దేశాల్లో ఉన్న నెట్‌వర్క్, అనుబంధ ఉగ్రవాద సంస్థల సహాయంతో బిన్ లాడెన్ ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. అమెరికా, బ్రిటన్‌లపై మరిన్ని దాడులు చేసేందుకు మార్గాలను వెతికాడని, అయితే ఏ నిర్దిష్ట ప్రదేశం లేదా సమయాన్ని సూచించలేదని పేర్కొంది. తిరానా, బాకు నగరాల్లో దాడులకు సిద్ధమవుతున్న లాడెన్ అనుచరులను అరెస్ట్ చేయడంలో అమెరికా అధికారుల సాయం అందిందని ఈ అంచనా వెల్లడించింది. ఉత్తర అమెరికా, యూరప్, తూర్పు ఆసియా ప్రాంతాల్లో బిన్ లాడెన్‌కు ఉన్న బలమైన వ్యవస్థల వల్ల, అక్కడ అమెరికా ప్రయోజనాలపై దాడులు జరుగుతాయన్న నివేదికలకు మరింత బలం చేకూరింది.

కెన్యా, టాంజానియాలలోని రెండు అమెరికన్ రాయబార కార్యాలయాలపై జరిగిన బాంబు దాడుల తర్వాత.. ఆగస్టు 1998లో ఆప్ఘనిస్తాన్, సుడాన్‌లలోని అల్ ఖైదా స్థావరాలపై అమెరికా క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల నుంచి బిన్ లాడెన్ ఇతర ఉగ్రవాద నాయకులు తప్పించుకోగలిగారని, వారి కమ్యూనికేషన్ వ్యవస్థ చెక్కుచెదరకుండా ఉందని సీఐఏ తెలిపింది. దాంతో కొన్ని క్యాంపుల్లో శిక్షణ మళ్లీ ప్రారంభం కాగా, మరికొన్నింటిని వేరే ప్రాంతాలకు తరలించారు. ఈ సీఐఏ పత్రాలు బయటకు వచ్చిన మూడేళ్ల తర్వాత, అంటే 11 సెప్టెంబర్ 2001న అల్ ఖైదాకు చెందిన 19 మంది ఉగ్రవాదులు అమెరికాలో 4 ప్రయాణీకుల విమానాలను హైజాక్ చేశారు. వీటిలో రెండు విమానాలు న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌ను ఢీకొట్టడంతో ఆ భవనాలు కూలిపోయాయి. మూడో విమానం వర్జీనియాలోని పెంటగాన్‌ను ఢీకొట్టగా, నాలుగో విమానం (యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 93) ప్రయాణికులు ఉగ్రవాదులను అడ్డుకోవడంతో పెన్సిల్వేనియాలోని ఒక పొలంలో కూలిపోయింది. ఈ నాలుగో విమానం వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ లేదా యుఎస్ క్యాపిటల్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు భావిస్తారు.

ఈ 9/11 దాడుల్లో 19 మంది ఉగ్రవాదులతో కలిపి దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల అనంతరం అమెరికా ఆప్ఘనిస్తాన్‌పై దాడి చేసింది. తదనంతరం, మే 2, 2011న పాకిస్తాన్‌లోని అబోతాబాద్‌లోని ఒక ఇంట్లో దాక్కున్న ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా బలగాలు హెలికాప్టర్ దాడిలో మట్టుబెట్టాయి. దీంతో దశాబ్ద కాలంగా సాగిన 9/11 మాస్టర్‌మైండ్ వేట ముగిసింది. తాజాగా విడుదలైన సీఐఏ పత్రాలు 9/11 కంటే మూడేళ్ల ముందే లాడెన్ నెట్‌వర్క్ ఎంత విస్తరించిందో తెలియజేస్తున్నాయి. 1998 నాటికే భారత్‌ను దాడి చేయాల్సిన దేశాల జాబితాలో చేర్చినట్లు దీని ద్వారా స్పష్టమవుతున్నప్పటికీ, ఎలాంటి నిర్దిష్ట కుట్ర లేదా టార్గెట్‌కు సంబంధించిన ఆధారాలు మాత్రం ఈ పత్రాలలో లేవు.