GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!

  • చిత్తూరు జిల్లాలో వెలుగులోకి భారీ జీఎస్టీ స్కామ్ వ్యవహారం..
  • స్క్రాప్ వ్యాపారం పేరుతో..
  • అమాయకుల ఆధార్, పాన్ కార్డులు తీసుకున్నట్లు ఆరోపణలు..
  • బాధితుల పేర్లపై నకిలీ జీఎస్టీ, బ్యాంక్ ఖాతాలు..
Gst Scam

Gst Scam

GST Scam: చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వస్తున్న జీఎస్టీ స్కామ్ వ్యవహారం కలకలం రేపుతోంది. స్క్రాప్ వ్యాపారం పేరుతో అమాయకుల ఆధార్, పాన్ కార్డులు తీసుకుని వారి పేర్లపై నకిలీ జీఎస్టీ ఖాతాలు, బ్యాంక్ ఖాతాలు తెరిచి భారీగా లావాదేవీలు నిర్వహించినట్లు ఆరోపణలు బయటపడుతున్నాయి. చిన్న వ్యాపారులకు కొంత నగదు ఆశ చూపి వారి పత్రాలు తీసుకుని, ఆ తర్వాత కోట్ల రూపాయల స్క్రాప్ లావాదేవీలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి.

జీఎస్టీ నోటీసులు అందిన తర్వాత బాధితులకు అసలు విషయం తెలిసినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన సయ్యద్ సమీర్ తన ఆధార్, పాన్ కార్డులను అక్రమంగా ఉపయోగించి స్క్రాప్ లావాదేవీలు నిర్వహించారని పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా స్క్రాప్ జీఎస్టీ స్కామ్‌లో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్తూరుకు చెందిన రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

గత ఏడేళ్లుగా ఈ తరహా వ్యవహారం సాగినట్లు ఆరోపణలు ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వందల కోట్ల రూపాయల ఆదాయ నష్టం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అరెస్ట్ చేసిన రెహమాన్‌కు స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై ఇప్పుడు పోలీసులపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. వందల కోట్ల స్కామ్ ఆరోపణలున్న కేసులో స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఈ జీఎస్టీ స్కామ్ వెనుక ఉన్న నెట్‌వర్క్ ఎంత పెద్దది..? ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు..? అన్నది ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.