NTV Telugu Site icon

Chiranjeevi-Balakrishna: పాతికేళ్ళ తరువాత అదే తీరున చిరు- బాలయ్య!

Chiru Balaiah

Chiru Balaiah

Chiranjeevi-Balakrishna: ఈ సంక్రాంతికి మరోమారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే! చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లోనూ, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’లోనూ బ్రదర్ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది. ఇలా ఈ ఇద్దరు టాప్ స్టార్స్ గతంలోనూ బ్రదర్ సెంటిమెంట్ తో పొంగల్ బరిలోనే ఆకట్టుకున్న సందర్భం 1997లో చోటు చేసుకుంది. అప్పుడు చిరంజీవి తన ‘హిట్లర్’లో ఏడుగురు చెల్లెళ్ళకు అన్నయ్యగా నటించారు. అదే సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ ‘పెద్దన్నయ్య’లో ఆయన ముగ్గురు తమ్ముళ్ళకు అన్నగా అభినయించారు. రెండు సినిమాలు ఘనవిజయం సాధించాయి. ‘హిట్లర్’ ఆ సంక్రాంతికి విడుదలైన చిత్రాలన్నిటిలోకి ఎక్కువ కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ‘పెద్దన్నయ్య’ ఆ యేడాది పొంగల్ బరిలో దూకిన సినిమాలన్నిటి కన్నా మిన్నగా వసూళ్ళు పోగేసింది. ఇప్పుడు కూడా రెండు సినిమాలూ విజయం సాధించి, సేమ్ సీన్ రిపీట్ కానుందని బాలకృష్ణ అభిమానులు, చిరంజీవి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Mahesh Babu: గౌతమ్ కి అన్నలా ఉన్నాడు…

‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవి, రవితేజ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. వారి మధ్య వైరం ఉన్నా, తరువాత అన్నదమ్ముల అనుబంధం నెలకొని కథ ముందుకు సాగుతుందని తెలుస్తోంది. ఇక బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’లో ఆయనకు చెల్లెలిగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఇందులోనూ అన్నాచెల్లెళ్ళ మధ్య శత్రుత్వం చోటు చేసుకొని కథ నడుస్తుందట! ఇలా ఒకే తరహా పాత్రలతో బాలకృష్ణ, చిరంజీవి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఇది రెండోసారి. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ వారి వారి అభిమాన నటులను ‘అన్నా’ అని అభిమానంతో పిలుచుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే గతంలో చిరంజీవి, బాలకృష్ణ అనేక చిత్రాలలో అన్న పాత్రల్లో అలరించారు. ఈ సారి సంక్రాంతి సంబరాల్లోనూ బాలయ్య, చిరు తమదైన అభినయంతో అన్న పాత్రలతో ఆకట్టుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. 1997 నాటి మ్యాజిక్ ను పాతికేళ్ళు దాటిన తరువాత కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోస్ రిపీట్ చేస్తారేమో చూడాలని సినీజనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ‘వీరసింహారెడ్డి’గా బాలయ్య, ‘వాల్తేరు వీరయ్య’గా చిరంజీవి ఏ రీతిన జనాన్ని మెప్పిస్తారో చూడాలి.